PM Cliks Selfie: కార్యకర్తతో సెల్ఫీ తీసుకున్న మోదీ.. ఆ ముచ్చట ఏమిటంటే..?
ABN , First Publish Date - 2023-04-09T11:01:00+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనలో ఓ ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. పార్టీకి గర్వకారణంగా..
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెన్నై (Chennai) పర్యటనలో ఓ ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. పార్టీకి గర్వకారణంగా నిలుస్తూ, నిస్వార్థ సేవలు అందిస్తున్న దివ్యాంగుడైన బీజేపీ (Bjp) కార్యకర్తతో ప్రధాని స్వయంగా సెల్ఫీ (Selfie) తీసుకున్నారు. ఆ ఆనంద క్షణాలను ప్రధాని ఓ ట్వీట్‌లో అందరితో పంచుకున్నారు. ''ప్రత్యేక సెల్ఫీ ఇది.. చెన్నైలో నేను ఎస్.మణికందన్‌ను (Manikandan) కలుసుకున్నాను. ఈరోడ్‌కు చెందిన ఆయన ఎంతో గర్వించదగిన కార్యకర్త. బూత్ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు. దివ్యాంగుడైన ఆయన సొంతగా దుకాణం నడుపుకుంటూ, రోజువారి లాభాల్లో గణనీయమైన మొత్తాన్ని పార్టీకి అందిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు'' అని మోదీ ఆ ట్వీట్‌లో ప్రశంసించారు.
పార్టీలో మణికందన్ వంటి కార్యకర్తలు ఉండటం గర్వకారణంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. మణికందన్ జీవనయాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, పార్టీ పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న అంకితభావం కూడా అంతే స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని సాధించాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
కాగా, ప్రధాన మంత్రి తన పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం కర్ణాటక చేరుకున్నారు. బండిపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించి, అక్కడి ఫ్రంట్‌లైన్ ఫీల్డ్ స్టాఫ్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో సమావేశమవుతున్నారు. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌ను సైతం సందర్శించి, అక్కడి ఏనుగుల శిక్షకులను, కవాడీలను కలుసుకోనున్నారు.