Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ షురూ.. ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు...
ABN , First Publish Date - 2023-09-18T11:22:00+05:30 IST
పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ సమయం తక్కువగానే ఉండొచ్చు కానీ చరిత్రాత్మకం కాబోతుందని వ్యాఖ్యానించారు. అనేక కారణాల వల్ల చాలా చరిత్రలో నిలవబోతోందన్నారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సెషన్ (Parliament Special Session) ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ఆరంభమైంది. బీజేపీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతోంది? ఏమేం బిల్లులు తీసుకురాబోతోంది? అనే హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో సెషన్ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ సమయం తక్కువగానే ఉండొచ్చు కానీ చరిత్రాత్మకం కాబోతుందని వ్యాఖ్యానించారు. అనేక కారణాల వల్ల చాలా చరిత్రలో నిలవబోతోందన్నారు. విశ్వాసం, ఉత్సాహంతో ఈ సెషన్ ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
తక్కువ సమయమే ఉండే ఈ చిన్న సెషన్‌కు కొంత సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలను ప్రధాని మోడీ కోరారు. ఈ మేరకు పార్లమెంటు సభ్యులందరినీ తాను అభ్యర్థిస్తున్నానని అన్నారు. ఏడుపులు, పెడబొబ్బులకు ఇతర సమయాలు ఉన్నాయన్నారు. ప్రత్యేక సెషన్ నమ్మకం, సానుకూలతలతో కూడి ఉంటుందన్నారు. పండుగ వాతావరణం, ఉత్సాహంతో ఉంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీ20 సదస్సు విజయవంతమైందని గుర్తుచేశారు. మరోవైపు చంద్రయాన్-3 మిషన్‌ను మరోసారి ఆయన ప్రశంసించారు. మూన్ మిషన్ యొక్క విజయం దేశ జెండాను ఎగురవేసిందన్నారు. శివశక్తి పాయింట్ కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారిందని అన్నారు. తిరంగా పాయింట్ మనలో గర్వాన్ని నింపుతోందన్నారు.
అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో ప్రధాని మోదీ సమావేశం..
ప్రత్యేక సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కావడానికి ముందే పలువురు కీలక మంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఈ జాబితాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు.