PM Dails Karnataka Leader: కర్ణాటక బీజేపీ సీనియర్ నేతకు ఫోన్ చేసిన మోదీ
ABN , First Publish Date - 2023-04-21T14:18:28+05:30 IST
కర్ణాటక సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు..
బెంగళూరు: కర్ణాటక సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పకు (KS Eshwarappa) స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారంనాడు ఫోన్ చేశారు. పార్టీ నిర్ణయాన్ని ఆమోదించి, పార్టీ పట్ల విధేయతను, చిత్తశుద్ధిని చాటుకున్నందుకు ఆయనకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. శివమొగ్గ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వరప్పకు బీజేపీ ఈసారి టిక్కెట్ నిరాకరించిన క్రమంలో ప్రధాని స్వయంగా ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
''మీరు కూడా నా తరహాలోనే ఒక సాధారణ కార్యకర్తగా చెప్పుకోవడం నాకెంతే గర్వకారణంగా అనిపించింది'' అంటూ ప్రధాని తనతో మాట్లాడిన వీడియోను ఈశ్వరప్ప షేర్ చేశారు. మీరు (ఈశ్వరప్ప), బీఎస్ యడియూరప్ప పార్టీకి గణనీయమైన సేవలు చేశారని ప్రధాని ఆ వీడియోలో ప్రశంసించారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వరప్ప ఆరోసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని అభిలషించినప్పటికీ, ఈవారం మొదట్లో విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు చోటుచేసుకోలేదు. శివమొగ్గ సిటీ కార్పొరేషన్‌కు చెందిన చెన్నబసస్పకు ఈశ్వరప్ప నియోజకవర్గాన్ని కేటాయించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి చెన్నబసప్పకు తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకి ఈశ్వరప్ప తెలియజేశారు. కర్ణాటకలో బీజేపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
మోదీ ఫోన్ ఊహించలేదు...
కాగా, పార్టీకి తాను చేసిన సేవలకు ప్రధానమంత్రి నుంచి ప్రశంసలు వస్తాయని, ఆయన ఫోన్ చేస్తారని తాను ఊహించలేదని ఈశ్వరప్ప తెలిపారు. మోదీ ప్రదర్శించిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడతాయి.