Karnataka: పద్మశ్రీ అవార్డులు పొందిన మహిళల పాదాలు మొక్కిన ప్రధాని
ABN , First Publish Date - 2023-05-03T17:39:13+05:30 IST
క్షేమ సమాచారాలు అడిగాక వారి పాదాలకు మోదీ నమస్కరించారు. తన పాదాలకు మొక్కేందుకు సుక్రి యత్నించగా మోదీ వారించారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అంకోలాలో (Ankola) పర్యటించారు. అక్కడ ఆయన బహిరంగసభ వేదికపై పద్మశ్రీ అవార్డ్ విజేతలైన తులసీ గౌడ (Tulsi Gowda), సుక్రి బొమ్మ గౌడను(Sukri Bommagowda) కలుసుకున్నారు. క్షేమ సమాచారాలు అడిగాక వారి పాదాలకు మోదీ నమస్కరించారు. తన పాదాలకు మొక్కేందుకు సుక్రి యత్నించగా మోదీ వారించారు. పర్యావరణ పరిరక్షకురాలిగా తులసి గౌడ 2021లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. 30 వేలకు పైగా మొక్కలను ఆమె నాటారు. తులసి గౌడ కర్ణాటకలోని హళక్కి గిరిజన తెగకు చెందినవారు. అనేక రకాల వన మూలికలు, అడవిలో పెరిగే అరుదైన మొక్కలకు సంబంధించిన పరిజ్ఞానం ఆమెకుంది.
మరోవైపు సుక్రి బొమ్మగౌడ హళక్కి వొక్కలిగ గిరిజన తెగకు చెందిన వారు. జానపద పాటల జాబితాలో ఆమె 2017లో పద్మశ్రీ గెలుచుకున్నారు.
మరోవైపు కర్ణాటకలో ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కలబురగిలో మెగా రోడ్ షో నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా నిల్చున్న అభిమానులు, ప్రజలు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. ట్రక్‌పై ప్రయాణిస్తూ ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా తనకు ఎదురైన చిన్నారులతో మోదీ సంభాషించారు. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అందులో ఒకరు డాక్టర్ కావాలని, మరొకరు పోలీస్ ఆఫీసర్ కావాలనుందని చెప్పారు. ప్రధాని కావాలని ఎవరికీ లేదా అని ప్రశ్నించగా మీలా కావాలనుందని ఓ చిన్నారి చెప్పారు.
అధికారంలోకొస్తే బజరంగ్‌దళ్‌ను (Bajrang Dal) బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress party) తమ మ్యానిఫెస్టోలో (manifesto) ప్రకటించడంతో ప్రధాని మండిపడుతున్నారు. ప్రతి సభలోనూ ఆయన బజరంగ్ బలీకి జై అంటూ నినాదాలు చేయిస్తున్నారు. హనుమంతుడు పుట్టిన నేలపై హనుమంతుడికి జై అంటే నిషేధిస్తారట అంటూ మోదీ ప్రచారం చేస్తున్నారు.
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 113.