Modi Thanks Gehlot: గెహ్లాట్‌ను ప్రశంసించిన మోదీ, దీనికి గెహ్లాట్ కౌంటర్ ఏమిచ్చారంటే..?
ABN , First Publish Date - 2023-04-12T16:39:27+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు రాజస్థాన్‌లో తొలి ''వందే భారత్ ఎక్స్‌ప్రెస్''ను వర్చువల్ తరహాలో ప్రారంభిస్తూ ...
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారంనాడు రాజస్థాన్‌లో తొలి ''వందే భారత్ ఎక్స్‌ప్రెస్''ను వర్చువల్ తరహాలో ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)పై ప్రశంసలు కురిపించారు. గెహ్లాట్‌ను తన 'మిత్రుడు'గా సంబోధించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తినప్పటికీ ఆయన 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు అభినందనలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ చివర్లో మోదీ ఈ ప్రస్తావన చేశారు.
''గెహ్లాట్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇప్పుడు అనేక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయన అభివృద్ధి పనులకు సమయం తీసుకుని రైల్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను స్వాగతిస్తున్నాను'' అని మోదీ అన్నారు. జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, తదితరులు హాజరయ్యారు.
ప్రధాని మోదీ ఈ సందర్భంగా రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ఇద్దరూ కూడా రాజస్థాన్‌కు చెందిన వారేనంటూ గుర్తు చేశారు. ''గెహ్లాట్ జీ...మీ రెండు చేతుల్లోనూ లడ్డూలు ఉన్నాయి. రైల్వే మంత్రి రాజస్థాన్‌కు చెందిన వారు. రైల్వే బోర్డు చైర్మన్ కూడా రాజస్థాన్‌కు చెందినవారే'' అని మోదీ చమత్కరించారు.
మూడు జిల్లాల ప్రధానకార్యాలయాలను రైల్ లింక్‌తో అనుసంధించాలని గెహ్లాట్ చేసిన విజ్ఞప్తికి మోదీ స్పందిస్తూ.. ''స్వాంతంత్ర్యం వచ్చిన వెంటనే జరగాల్సిన పనులు ఇప్పటి వరకూ జరగలేదు...కానీ మీకు నామీద చాలా నమ్మకం ఉంది. మీరు ఆ పనిని ఇవాళ నాపై ఉంచారు. ఇది మీ నమ్మకం. మీ నమ్మకమే నా స్నేహానికి బలం. స్నేహంపై మీకున్న విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను'' అని అన్నారు.
గెహ్లాట్ రియాక్షన్ ఇదే...
కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను అభినందించడంపై వెంటనే స్పందించేందుకు అశోక్ గెహ్లాట్ నిరాకరించారు. మాజీ రైల్వే మంత్రులను ప్రధాని మోదీ అవమానించారని విమర్శించారు. రైల్వే బడ్జెట్‌ను సెపరేట్ చేయడం ద్వారా భారత రైల్వేల ప్రాధాన్యతను ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించి వేసిందని అన్నారు. ఇవాల్టి ప్రసంగం పూర్తిగా 2023-2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినదేనని, ఇది బీజేపీ పోల్ ఎజెండా వంటిదేనని గెహ్లాట్ వ్యాఖ్యానించారు.