Indian Military : మిలిటరీ చీఫ్స్‌తో మోదీ భేటీ త్వరలో
ABN , First Publish Date - 2023-01-08T10:45:24+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మిలిటరీ థియేటర్ కమాండ్స్ ఏర్పాటుపై
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మిలిటరీ థియేటర్ కమాండ్స్ ఏర్పాటుపై మార్చిలో సమీక్షించబోతున్నారు. కర్ణాటకలోని కర్వార్ నావికా దళ స్థావరంలో జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (CCC)లో దీనికి సంబంధించిన వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ (Gen Anil Chauhan) తెలియజేస్తారు. భారత నావికా దళం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో కేవలం కమాండర్స్-ఇన్-చీఫ్ స్థాయి అధికారులు మాత్రమే పాల్గొంటారు, కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.
త్రివిధ దళాలను పరస్పర ప్రయోజనకరంగా కలగలిపేందుకు థియేటర్ కమాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ దిశగా జరుగుతున్న కార్యక్రమాలను మోదీకి జనరల్ చౌహాన్ వివరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంలో ఈ మూడు దళాల్లో దేనికైనా విభిన్నమైన అభిప్రాయాలు ఉంటే, వాటిని కూడా మోదీకి వివరిస్తారు. సీడీఎస్ ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులతో చర్చలు జరిపారు. థియేటర్ కమాండ్స్ ఏర్పాటుపై ఈ ఏడాదిలో ప్రకటన రావచ్చునని తెలుస్తోంది.
థియేటర్ కమాండ్స్ ఏర్పాటు విషయంలో త్రివిధ దళాల అధిపతులు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చారు. అయితే ప్రతి దళం తన సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమకు ముఖ్యమైన పదవులు లభించే విధంగా చూసుకుంటోంది. ఇండియన్ మిలిటరీకి సాయుధ డ్రోన్ల అవసరంపై కూడా ఈ సమావేశంలో మదింపు చేస్తారని తెలుస్తోంది.