PM Modi: కర్ణాటక ఎన్నికల వేళ మోదీ షెడ్యూల్ ఫిక్స్.. సుడిగాలి పర్యటనలు..
ABN , First Publish Date - 2023-04-27T22:42:04+05:30 IST
ఈ నెల 29న ఆయన కర్ణాటకలో పర్యటిస్తారు. మొత్తం 6 రోజుల్లో 22 ర్యాలీల్లో పాల్గొంటారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రచారానికి సన్నద్ధమౌతున్నారు. ఈ నెల 29న ఆయన కర్ణాటకలో పర్యటిస్తారు. మొత్తం 6 రోజుల్లో 22 ర్యాలీల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి గడువు మే నెల 8వ తేదీ వరకూ ఉంది. దీంతో మోదీ తక్కువ సమయంలో ఎక్కువ చోట్ల పర్యటించనున్నారు. హుమ్నాబాద్, విజయపుర, బెంగళూరు, కోలార్, చెన్నపట్న, బెలూర్ నియోజకవర్గాల్లో మోదీ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ప్రాధాన్యతను మోదీ కర్ణాటక ఓటర్లకు వివరించనున్నారు.
మరోవైపు ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge ) అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని విష పాముతో (poisonous snake) పోల్చారు. కలబుర్గిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ విషపాము అని విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారని ఖర్గే అన్నారు. అయితే తన వ్యాఖ్యలు మోదీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఖర్గే మనసులో విషం ఉందని అందుకే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విమర్శించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పెద్దల మెప్పుకోసం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఖర్గే అనుచిత వ్యాఖ్యల రగడ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కొనసాగేలా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా మోదీని వ్యక్తిగతంగా విమర్శించి దెబ్బ తిన్నారు. మోదీని మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి) అని స్వయంగా సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి చాయ్ అమ్ముకోమని మణిశంకర్ అయ్యర్ గతంలో విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు మోదీని వ్యక్తిగతంగా విమర్శించారు. ఎన్నికల్లో మాత్రం లబ్ది పొందలేకపోయారు.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.