Narendra Modi: చంద్రయాన్-3 ఎఫెక్ట్.. ఇకపై ఆ రోజే నేషనల్ స్పేస్ డే..!!
ABN , First Publish Date - 2023-08-26T16:18:46+05:30 IST
చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా ఇండియా చరిత్రకెక్కింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-3 సక్సెస్ భారతీయులను గర్వపడేలా చేసిందని.. దీంతో ఆ ప్రయోగం విజయవంతమైన ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ప్రపంచమంతటా చంద్రయాన్-3 గురించే ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. దీంతో ఇండియా పేరు ప్రపంచమంతా మారుమోగిపోతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా ఇండియా చరిత్రకెక్కింది. గతంలో అమెరికా, చైనా, రష్యా మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-3 సక్సెస్ భారతీయులను గర్వపడేలా చేసిందని.. దీంతో ఆ ప్రయోగం విజయవంతమైన ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువతరాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ రంగంలో ప్రోత్సహించేందుకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని తాకిన రోజును అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ప్రస్తుత యుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందంజలో ఉన్న దేశం చరిత్ర సృష్టిస్తుందని జోస్యం చెప్పారు.
దక్షిణాఫ్రికా బ్రిక్స్ సదస్సు ముగించుకుని భారత్ వచ్చిన ప్రధాని మోదీ శనివారం ఉదయం నేరుగా బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం ఇస్రో కమాండ్ సెంటర్‌లో సైంటిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్-3 ప్రయోగంలో పాల్గొన్న వారిని అభినందించారు. భారత్ సత్తా ఏంటో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచానికి చాటిచెప్పారని మోదీ ప్రశంసించారు. తొలుత చంద్రయాన్-3 బృందంతో ప్రధాని మోదీ ఫోటోలు దిగారు. అనంతరం చంద్రయాన్-3 ప్రయోగంలో చేపట్టిన దశల గురించి ప్రధానికి ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ వివరించారు. ప్రధాని మోదీకి వ్యోమనౌకకు చెందిన సూక్ష్మ నమూనాతో పాటు ల్యాండిగ్ సైట్ ఫ్రేమ్ ఫోటోను అందించారు.
ఇది కూడా చదవండి: Honey Trap: ఫోటోలో గానీ, రీల్స్ గానీ పోస్ట్ చేయొద్దు.. భద్రతా బలగాలకు కీలక ఆదేశాలు
అటు చంద్రుడిపై విక్రమ్ ల్యాండైన ప్రాంతాన్ని శివశక్తిగా ప్రధాని మోదీ నామకరణం చేశారు. అటు చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ జరిగిన ప్రదేశానికి తిరంగా పేరు పెట్టారు. అయితే చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి శివశక్తిగా నామకరణం చేయడంపై మోదీ వివరణ కూడా ఇచ్చారు. శివ అనే పదాన్ని భారతీయులు శుభంగా భావిస్తారని.. మహిళల గురించి మాట్లాడేటప్పుడు శక్తి అనే పదాన్ని వాడుతామని.. అందుకే శివశక్తిగా పేరు పెట్టినట్లు బీజేపీ నేతల సమావేశంలో మోదీ తెలిపారు. చంద్రయాన్ 3లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారని.. ఈ శివశక్తి పాయింట్ రాబోయే తరాలను ప్రజల సంక్షేమం కోసం సైన్స్‌ను ఉపయోగించుకునేలా ప్రేరేపిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని అన్నారు.
కాగా ప్రధాని మోదీ తమ కార్యాలయానికి వచ్చి అభినందనలు తెలియజేయడం ఆనందంగా ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. ప్రధాని మోదీ తమలో స్ఫూర్తిని నింపారని తెలిపారు. చంద్రయాన్-3, చంద్రయాన్-2 మిషన్‌లు ల్యాండైన ప్రదేశాలకు శివశక్తి, తిరంగ అని పేర్లు పెట్టడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. చంద్రయాన్-3 సక్సెస్ యువత సైన్స్ రంగం వైపు ఆసక్తి చూపేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు విక్రమ్ ల్యాండర్ ప్రాంతాన్ని శివశక్తిగా మోదీ నామకరణం చేయడంపై ఇస్రో మహిళా సైంటిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజ్ఞాన్ రోవర్ తమకు ఓ బేబీ లాంటిది అని.. చంద్రుడిపై ఆ బేబీ స్టెప్పులు వేస్తుందని ఓ మహిళా సైంటిస్ట్ వ్యాఖ్యానించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.