Teachers’ Day : ఉపాధ్యాయులకు వందనం : మోదీ
ABN , First Publish Date - 2023-09-05T10:34:16+05:30 IST
ప్రధాన మంత్రి మోదీ ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు గౌరవ వందనం చేశారు. భావి తరాలను తీర్చిదిద్దడానికి అంకితమైనందుకు అభినందించారు. వారి ప్రభావం విద్యార్థినీ, విద్యార్థులపై గొప్పగా ఉంటుందన్నారు.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు గౌరవ వందనం చేశారు. భావి తరాలను తీర్చిదిద్దడానికి అంకితమైనందుకు అభినందించారు. వారి ప్రభావం విద్యార్థినీ, విద్యార్థులపై గొప్పగా ఉంటుందన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంత్యుత్సవాల సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోదీ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు గౌరవ వందనం చేశారు. మన భవిష్యత్తును నిర్మించడంలో, కలలను ప్రేరేపించడంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషిస్తారన్నారు. వారి అంకితభావం, గొప్ప ప్రభావాలకు ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగా వారికి గౌరవ వందనం చేద్దామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంత్యుత్సవాల సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నానని తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఈ ట్వీట్‌కు మోదీ జత చేశారు.
జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ సోమవారం మాట్లాడారు. ఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న తన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 75 మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఒక్కొక్కరికి రూ.50 వేలు నగదు, రజత పతకం, మెరిట్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 వరకు భారత దేశ ఉప రాష్ట్రపతిగా, 1962 నుంచి 1967 వరకు రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయనను ‘భారత రత్న’ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆయన 1888 సెప్టెంబరు 5న జన్మించారు. విద్యా రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతినాడు ఉపాధ్యాయ దినోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్... ఆమె ఏమన్నారో తెలిస్తే...
High Court: దసరా వేడుకల్లో అశ్లీల నృత్యాలొద్దు