President: 5న ముదుమలైకి రాష్ట్రపతి
ABN , First Publish Date - 2023-07-29T08:37:25+05:30 IST
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆగస్టు 5న నీలగిరి జిల్లా ముదుమలైలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని సం
ఐసిఎఫ్(చెన్నై): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆగస్టు 5న నీలగిరి జిల్లా ముదుమలైలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని సందర్శించనున్నారు. ముదుమలై పులుల శరణాలయంలో రఘు, బొమ్మి అనే ఏనుగులను బొమ్మన్, ఆయన భార్య బెల్లి సంరక్షిస్తున్న తీరుపై చిత్రీకరించిన లఘుచిత్రానికి (ది ఎలిఫెంట్ విష్పరర్స్) ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. అనంతరం ముదుమలై ప్రాంతం, బొమ్మన్ దంపతులు అంతర్జాతీయంగా ఖ్యాతిపొందారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముదుమలైకి వచ్చి బొమ్మన్ దంపతులను అభినందించి వెళ్లారు. కాగా ఈనెల 18న బొమ్మన్ దంపతులు రాష్ట్రపతిని ఢిల్లీలో కలుసుకోగా, వారికి జ్ఞాపికను బహూకరించిన ద్రౌపదిముర్ము.. ఘనంగా సత్కరించి పంపించారు. ఈ సందర్భంగా బొమ్మన్ దంపతులు రాష్ట్రపతిని ముదుమలైకు ఆహ్వానించగా, అందుకు ఆమె అంగీకరించారు. ఈ మేరకు ఆమె వచ్చే నెల 5న ముదుమలైకు వెళ్లనున్నారు. ఆరోజున ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా మైసూరు(Mysore)కు వెళ్లనున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో తెప్పకాడుకు శిబిరానికి సాయంత్రం 3.45 గంటలకు చేరుకుంటారు. ముదుమలైలో ఉన్న మావటీలు, ఆదివాసీ ప్రజలను కలుసుకుని, పెంపుడు ఏనుగులను సందర్శించనున్నారు. అనంతరం ఆమె ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో మైసూరుకు తిరిగివెళ్లనున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.