President: మళ్లీ రాష్ట్రపతి పర్యటన రద్దు
ABN , First Publish Date - 2023-06-13T08:02:39+05:30 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) పర్యటన మరోమారు రద్దయింది. దీంతో స్థానిక గిండిలో నిర్మించిన ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ
- 15న గిండి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం!
పెరంబూర్(చెన్నై): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) పర్యటన మరోమారు రద్దయింది. దీంతో స్థానిక గిండిలో నిర్మించిన ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఈ నెల 15వ తేది ముఖ్యమంత్రి ఎంకే స్టాలినే ప్రారంభించనున్నట్లు తెలిసింది. రూ.240 కోట్లతో 1,000 పడకల వసతి, అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ ఆస్పత్రిని ఈ నెల 5వ తేది రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభిస్తారని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆ సమయంలో రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఉండడంతో ప్రారంభోత్సవం తాత్కాలికంగా వాయిదాపడింది. రాష్ట్రపతి కేటాయించే రోజున ఆసుపత్రి ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటించారు. అంతేగాక రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈనెల 15న ఆస్పత్రి ప్రారంభోత్సవాన్ని ఖరారు చేశారు. అయితే తాజాగా రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో.. ఆ తేదీన రాష్ట్రపతి తెలంగాణ పర్యటనలో ఉంటారని పేర్కొంది. అంతేగాక ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశం ప్రస్తావనే లేకుండాపోయింది. దీంతో, ఇప్పటికే నిర్ణయించినట్లుగా ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆసుపత్రి ప్రారంభించనున్నట్లు తెలిసింది.