Priynaka Gandhi: సల్మాన్ తేరే నామ్ తరహాలో మోదీతో మేరే నామ్..!
ABN , First Publish Date - 2023-11-15T18:05:33+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. బుధవారంనాడు మధ్యప్రదేశ్‌లోని దతియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, నటుడు సల్మాన్ ఖాన్ 'తేర్ నామ్' సినిమా తరహాలో 'మేరే నామ్' పేరుతో ప్రధానితో కూడా సినిమా తీయెచ్చని అన్నారు.
దతియా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) విమర్శలు గుప్పించారు. బుధవారంనాడు మధ్యప్రదేశ్‌లోని దతియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, నటుడు సల్మాన్ ఖాన్ 'తేర్ నామ్' సినిమా తరహాలో 'మేరే నామ్' పేరుతో ప్రధానితో కూడా సినిమా తీయెచ్చని అన్నారు. తేరానామ్ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర మొదట్నించీ చివరి వరకూ ఏడుస్తూనే ఉంటుందని, ఇదే తరహాలో మోదీతో కూడా 'మేరేనామ్' పేరుతో సినిమా తీయొచ్చని అన్నారు.
''ఎప్పుడు మనస్తాపంతో బాధపడుతుంటే ప్రధాని ఈ దేశంలో ఆయన ఒక్కరే. ఒక లిస్ట్‌తో ఆయన (మోదీ) కర్ణాటక వెళ్తారు. తనని ఆడిపోసుకుంటున్నారని, అనరాని మాటలు అంటున్నారని చెబుతారు. మళ్లీ ఇక్కడికి (మధ్యప్రదేశ్) వస్తారు. అదే మాట చెబుతారు'' అంటూ మోదీ తీరును తప్పుపట్టారు. తన తండ్రి రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటూ, తన తండ్రి ప్రదానిగా ఉన్నప్పుడు ప్రజలు ఆయనను నిలదీసినప్పుడు కూడా ఆయన ఏమీ అనుకునే వారు కాదని అన్నారు. రాజీవ్ భయ్యా...మీరు మాకు రోడ్లు వేయకపోతే మీకు ఓటు వేయం అని అమేథీ ప్రజలు అన్నప్పుడు ఆయన ప్రధాని హోదాలో ఉండి కూడా కోపం తెచ్చుకునే వారు కాదని, తాను ఆదేశాలు ఇస్తానని, కాకపోతే కొంత సమయం పడుతుందని వినయంగా చెప్పేవారని ప్రియాంక గుర్తుచేశారు. ఈ దేశ సంప్రదాయం అలాంటిదని, మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం పోరాడటం వల్లనే ప్రజలు అత్యున్నత పదవుల్లో పొందట, సంపన్నులు కావడం జరిగిందని అన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని, కులగణన నిర్వహిస్తామని చెప్పారు. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.