Robert Vadra: కాంగ్రెస్ నేతలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడరు..
ABN , First Publish Date - 2023-08-14T16:59:57+05:30 IST
ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తప్పుపట్టారు. పాలక ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ఎంతోకాలం మనుగడ సాగించలేవని అన్నారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు భయమంటే తెలియదని అన్నారు.
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై మధ్యప్రదేశ్ (Madha pradesh)లోని బీజేపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) తప్పుపట్టారు. పాలక ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ఎంతోకాలం మనుగడ సాగించలేవని అన్నారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు భయమంటే తెలియదని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. చట్టపరంగానో, ఏజెన్సీల ద్వారానో తమపై ఒత్తిడి తీసుకురావ్చచని, వాళ్లెంత ఒత్తడి తెస్తే అంతకంత తాము బలపడతామని ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాద్రా తెలిపారు.
''కర్ణాటకలో 40 శాతం కమిషన్ ప్రభుత్వం నడిచింది. అదే ఇక్కడ (మధ్యప్రదేశ్) కూడా ఉంది. వాళ్లు (బీజేపీ) ఎక్కడైతే ప్రభుత్వాలను కూల్చేసి, తమ సొంత రాజకీయాలు నడుపుకుంటున్నారో అక్కడ ప్రభుత్వాలు ఎంతోకాలం నిలబడవు. ప్రజలు తిరగబడతారు. ప్రియాంక, రాహుల్, సోనియాగాంధీలు ఏమాత్రం భయపడే వ్యక్తులు కాదు. మేము (కాంగ్రెస్) ప్రజావాణి వినిపిస్తూనే ఉంటాం'' అని వాద్రా అన్నారు.
ఎఫ్ఐఆర్ ఎందుకంటే..
మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టర్లు 50 శాతం లంచం ఇవ్వాల్సిందేనంటూ జ్ఞానేంద్ర అవస్తి అనే వ్యక్తి పేరుతో ఉన్న ఓ లేఖను ప్రియాంక శనివారం పోస్ట్ చేశారు. దీనిపై ఇండోర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌యాదవ్ కూడా ఆ పోస్టును షేర్ చేయడంతో, వారితోపాటు, జ్ఞానేంద్ర అవస్తి అనే వ్యక్తిపైనా కేసు నమోదైంది. ఇండోర్‌కు చెందిన బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ నిమేశ్ పాఠక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రియాంక, కమల్‌నాథ్, అరుణ్‌యాదవ్, జ్ఞానేంద్ర అవస్తిపై ఐపీసీలోని 420(చీటింగ్), 469(పరువు నష్టం కలిగించేందుకు ఫోర్జరీ చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.