Hindu Temple : కెనడాలో హిందూ దేవాలయంపై విద్వేష దాడి

ABN , First Publish Date - 2023-01-31T17:23:32+05:30 IST

కెనడా (Canada)లోని బ్రాంప్టన్‌లో ఓ హిందూ దేవాలయంపై విద్వేష దాడి జరిగింది. ఈ దేవాలయం ప్రాంగణంలో భారత్ వ్యతిరేక

Hindu Temple : కెనడాలో హిందూ దేవాలయంపై విద్వేష దాడి
Hindu Temple in Canada

టొరంటో : కెనడా (Canada)లోని బ్రాంప్టన్‌లో ఓ హిందూ దేవాలయంపై విద్వేష దాడి జరిగింది. ఈ దేవాలయం ప్రాంగణంలో భారత్ వ్యతిరేక (Anti India) నినాదాలను రాశారు. ఈ దారుణ సంఘటనను టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ (Indian Community) మనోభావాలను ఈ సంఘటన తీవ్రంగా గాయపరచిందని, ఈ దేవాలయం భారతీయ వారసత్వ (Indian Heritage) ఔన్నత్యానికి ప్రతీక అని తెలిపింది.

ఇండియన్ కాన్సులేట్ విడుదల చేసిన ప్రకటనలో, బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిరం (Gauri Shankar Mandir) భారతీయ వారసత్వ ఔన్నత్యానికి ప్రతీక అని తెలిపింది. ఈ దేవాలయం ప్రాంగణంలో భారత దేశ వ్యతిరేక నినాదాలను రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ విద్వేషపూరిత చర్య వల్ల కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ మనోభావాలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. తమ ఆందోళనను కెనడా అధికారులకు తెలియజేసినట్లు వివరించింది.

బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఇచ్చిన ట్వీట్‌లో, గౌరీ శంకర్ మందిర్‌పై విద్వేషపూరిత దాడిని ఖండించారు. ఇటువంటి విద్వేషపూరిత విధ్వంసానికి తమ నగరంలో, తమ దేశంలో స్థానం లేదన్నారు. పీల్ రీజనల్ పోలీస్ చీఫ్ నిషాన్ దురైయప్పకు తన ఆవేదనను తెలిపానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ప్రార్థనా స్థలం వద్ద తాము సురక్షితంగా ఉన్నామని భావించగలగాలని తెలిపారు.

ఇదిలావుండగా, కెనడాలో హిందూ దేవాలయాలపై విద్వేషపూరిత దాడులు చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. 2022 సెప్టెంబరులో బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిరంపై కూడా కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు (Khalistani Extremists) ఇదే విధంగా దాడి చేశారు. భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.

కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య (Chandra Arya) ఇచ్చిన ట్వీట్‌లో, టొరంటోలోని బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ్ మందిర్‌ (BAPS Swami Narayan Mandir)పై కెనడియన్ ఖలిస్థానీ తీవ్రవాదులు చేసిన దాడిని అందరూ ఖండించాలన్నారు. ఇది చెదురుమదురు సంఘటన కాదన్నారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి విద్వేషపూరిత నేరాలు జరుగుతున్నాయన్నారు. హిందూ కెనడియన్లు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.

2022 జూలైలో రిచ్‌మండ్ హిల్‌లోని విష్ణు మందిర్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహంపై కూడా ఖలిస్థానీ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ సంఘటనలను పాకిస్థాన్ అనుకూల సామాజిక మాధ్యమాల ఖాతాల్లో వైరల్ చేశారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ నెల 29న భారత దేశ జాతీయ జెండాను తీసుకెళ్తున్నవారిపై ఖలిస్థాన్ అనుకూల సంస్థలకు చెందినవారు దాడి చేశారు. దాడులకు భయపడి, పారిపోతున్న భారతీయులను ఖలిస్థానీలు కొట్టారు. మెల్‌బోర్న్‌లోని శ్రీ శివ విష్ణు దేవాలయాన్ని ఆస్ట్రేలియాలోని ఇండియన్ హై కమిషనర్ మన్‌ప్రీత్ వోహ్రా సందర్శించారు. ఖలిస్థానీ శక్తులు ఈ దేవాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రార్థనా స్థలాలను అన్ని మతాలవారూ గౌరవిస్తారన్నారు. వోహ్రా ఈ నగరంలోని మిల్ పార్క్ ఏరియాలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ టెంపుల్‌ను కూడా సందర్శించారు. భారత వ్యతిరేక శక్తులు, ఖలిస్థానీలు ఈ దేవాలయం గోడలపై కూడా భారత వ్యతిరేక నినాదాలు రాశారు.

Updated Date - 2023-01-31T17:23:35+05:30 IST