Punjab: సునీల్ జాఖడ్ మేనల్లుడు సందీప్ జాఖఢ్‌పై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2023-08-19T21:04:17+05:30 IST
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై పంజాబ్ లోని అబోహర్ ఎమ్మెల్యే సందీప్ జాఖఢ్‌పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా కమిటీ ఈ చర్య తీసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింహ్ రాజా వారింగ్ చేసిన ఫిర్యాదుపై క్రమశిక్షణా కమిటీ ఈ చర్య తీసుకుంది.
ఛండీగఢ్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై పంజాబ్ (Punjab)లోని అబోహర్ ఎమ్మెల్యే సందీప్ జాఖఢ్ (Sandeep Jakhar)పై కాంగ్రెస్(Congress) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) క్రమశిక్షణా కమిటీ ఈ చర్య తీసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింహ్ రాజా వారింగ్ చేసిన ఫిర్యాదుపై క్రమశిక్షణా కమిటీ ఈ చర్య తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చినట్టు పంజాబ్ కాంగ్రెస్ ఒక ట్వీట్‌లో తెలిపింది. క్రమశిక్షణా కమిటీ సభ్య కార్యదర్శి తారిఖ్ అన్వర్ ఈ సస్పెన్షన్ ఉత్తర్వుపై సంతకంపై చేశారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీని వీడిన పంజాబ్ బీజపీ చీఫ్ సునీల్ జాఖడ్ మేనల్లుడే సందీప్ జాఖఢ్.
''మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం మీరు భారత్ జోడో యాత్రతో సహా పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. బీజేపీ జెండా ఎగురుతున్న ఉమ్మడి అకామిడేషన్‌లోనే మీరు ఉండిపోయారు. పార్టీకి, పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. బహిరంగాగానే మీ అంకుల్ సునీల్ జాఖఢ్‌ను సమర్ధించారు. మీపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత తక్షణమే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది'' అని తారిఖ్ అన్వర్ ఆ ఉత్వర్వులో పేర్కొన్నారు.
కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జాఖఢ్‌కు, వారింగ్‌కు మధ్య ఇంతకుముందు మాటల యుద్ధం జరిగింది. జాఖడ్‌కు ధీమా ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి అబోహార్ నుంచి పోటీ చేయాలని వారింగ్ సవాలు చేశారు. తనకు నోటీసు ఇచ్చి పార్టీ నుంచి తప్పించాలని జాఖడ్ ప్రతిసవాలు విసిరారు.