Punjab Governor: పంజాబ్ ముఖ్యమంత్రికి గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ‘సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తా’

ABN , First Publish Date - 2023-08-25T21:29:44+05:30 IST

కొంతకాలం నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. శుక్రవారం సీఎంకు గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్...

Punjab Governor: పంజాబ్ ముఖ్యమంత్రికి గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ‘సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తా’

కొంతకాలం నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. శుక్రవారం సీఎంకు గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమిస్తానని కూడా తెలిపారు. తాను రాసిన లేఖలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై తాను కలత చెందానని పేర్కొన్న ఆయన.. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంపై రాష్ట్రపతికి నివేదించగలనని అన్నారు. ఈమేరకు ఆయన మాన్‌కు పంపిన లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.


రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ప్రకారం.. తాను తుది నిర్ణయం తీసుకోవడానికి ముందే లేఖలపై సమాధానం ఇవ్వాలని సీఎం మాన్‌కు గవర్నర్ పురోహిత్ సూచించారు. ఇదే సమయంలో.. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందోనన్న విషయాలపై కూడా సమాచారం ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఇవ్వకపోతే.. రాజ్యాంగం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఉండదని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగంపై తనకు వివిధ ఏజెన్సీల నుంచి నివేదికలు అందాయని.. ఫార్మసీలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మద్యం దుకాణాల్లో కూడా అవి ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నించారు. పంజాబ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికను సైతం ఆ లేఖలో గవర్నర్ ఉటంకించారు.

మరోవైపు.. గవర్నర్ జారీ చేసిన ఈ హెచ్చరికలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత మల్విందర్ సింగ్ కాంగ్ స్పందించారు. తమది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వమని.. ఇలా ఎన్నుకోబడిన వ్యక్తులకు భారత రాజ్యాంగం అధికారం ఇస్తుందని అన్నారు. తాను రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని గవర్నర్ ఇచ్చిన బెదిరింపులతో బీజేపీ అజెండాని బయటపెట్టారని అన్నారు. ఇదిలావుండగా.. ఆప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గవర్నర్ పలుమార్లు ప్రశ్నిస్తూ లేఖలు రాశారు. కానీ.. అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలు రాలేదు. గతంలోనూ ఈ విషయంపై విమర్శలు చేసిన గవర్నర్.. ఇప్పుడు సహనం కోల్పోయి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని బెదిరింపులకి దిగారు.

Updated Date - 2023-08-25T21:29:44+05:30 IST