Raghav chadha: రాఘవ్ చద్దాకు హైకోర్టులో ఊరట, బంగ్లా ఖాళీ చేయనక్కర్లేదంటూ తీర్పు
ABN , First Publish Date - 2023-10-17T21:02:19+05:30 IST
ప్రభుత్వ బంగ్లా విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. దీనిపై రాఘవ్ చద్దా ఒక ట్వీట్‌లో తన స్పందన తెలిపారు. ఈ పోరాటం ఒక ఇంటి కోసమో, దుకాణం కోసమే కాదని, రాజ్యాంగాన్ని రక్షించేందుకని ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రభుత్వ బంగ్లా (Government bungalow) విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)కు హైకోర్టులో (High court) ఊరట లభించింది. ఆయన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. దీనిపై రాఘవ్ చద్దా ఒక ట్వీట్‌లో తన స్పందన తెలిపారు. ఈ పోరాటం ఒక ఇంటి కోసమో, దుకాణం కోసమే కాదని, రాజ్యాంగాన్ని రక్షించేందుకని ట్వీట్ చేశారు.
వివాదం ఏమిటి?
రాఘవ్ చద్దా గత ఏడాది పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా తొలిసారి ఎన్నికకావడంతో ఆయనకు టైప్-6 బంగ్లాను 2022 జూలైలో కేటాయించారు. అయితే, తనకు కొద్దిపాటి పెద్ద బంగ్లా కావాలని ఆయన రాజ్యసభ సెక్రటేరియట్‌ను అభ్యర్థన చేయడంతో గత ఏడాది ఆగస్టులో టైప్-7 బంగ్లాను ఆయనకు కేటాయించారు. రాజ్యసభ అధికారిక గెజిట్‌లో దీనిని నోటిఫై కూడా చేశారు. అయితే గత ఏడాది మార్చిలో రాజ్యసభ సచివాలం ఆయనకు నోటీసులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం టైప్-7 బంగ్లాను రద్దు చేస్తున్నామని తెలిపింది. కేంద్రంపై పార్లమెంటు లోపల, బయట తన వాణి వినిపిస్తుందనే తన బంగ్లాను రద్దు చేశారని చద్దా ఆరోపిస్తూ, పాటియాలా కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కోర్టు తొలుత స్టే ఇచ్చింది. ఆ ఆదేశాలను సెక్రటేరియట్ సవాలు చేయడంతో విచారణ కోర్టు ఆ 'స్టే'ను ఎత్తివేసింది. దీనిపై రాఘవ్ చద్దా హైకోర్టులో సవాలు చేశారు. మంగళవారం దీనిపై కోర్టు విచారణ చేపట్టి, రాఘవ్ చద్దా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిన అవసరం లేదని తీర్పునిస్తూ, దిగువ కోర్టు ఆదేశాలను పక్కనపెట్టేసింది.