Rahul Gandhi: అనర్హత వేటు తర్వాత తొలిసారి వయనాడ్ వెళ్లిన రాహుల్ గాంధీ... పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఏం చేశారంటే...
ABN , First Publish Date - 2023-04-11T18:06:13+05:30 IST
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో ప్రజలు..
వయనాడ్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేరళలోని వయనాడ్ (Wayanad) నియోజకవర్గంలో ప్రజలు మంగళవారంనాడు బ్రహ్మరథం పట్టారు. లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన తరువాత తన మాజీ నియోజకవర్గమైన వయనాడ్‌లో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి. రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra), కేరళ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన వెంట ఉన్నారు. 'సత్యమేవ జయతే' అనే పేరుతో కల్‌పట్టా టౌన్‌లో జరిగిన రోడ్‌షో రాహుల్ పాల్గొని, పెద్ద ఎత్తున హాజరైన ప్రజలకు, తన మద్దతుదారులకు చేతులు ఊపుతూ ముందుకు కదిలారు.
యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన వందలాది మంది కార్యకర్తలు భారత జాతీయ పతాకలను చేతిలో పట్టుకుని రోడ్‌షోలో పాల్గొన్నారు. వయోభేదం లేకుండా ప్రజలు దారిపొడుగునా రాహుల్‌కు స్వాగతం పలికారు.
మోదీ ఇంటిపేరుపై 2019లో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో ఇటీవల సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇవ్వడంతో పాటు బెయిలు కూడా పొడిగించింది. కోర్టు తీర్పు వెలువడిన గంటల్లోనే ఆయన లోక్‌సభ సభ్యత్వంపై లోక్‌సభ సెక్రటేరియట్ వేటు వేసింది. సూరత్ కోర్టు తీర్పుపై ఇటీవల సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించడంతో కేసు విచారణను వాయిదా వేస్తూ, రాహుల్ బెయిల్‌ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో రాహుల్ వయనాడ్‌లో పర్యటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రోడ్‌షో అనంతరం బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు.