Rahul Gandhi : రాహుల్ గాంధీకి తొలగిన అడ్డంకులు.. మళ్లీ ఎంపీగా పార్లమెంటుకు!..

ABN , First Publish Date - 2023-08-04T14:51:26+05:30 IST

‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభిండంతో ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన లోక్ సభ సచివాలయం నుంచి రావలసి ఉంది. ఆయన దోషి అని గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేయడంతో ఆయన పార్లమెంటులో తన గళాన్ని వినిపించే అవకాశం మళ్లీ రాబోతోంది.

Rahul Gandhi : రాహుల్ గాంధీకి తొలగిన అడ్డంకులు.. మళ్లీ ఎంపీగా పార్లమెంటుకు!..
Rahul Gandhi

న్యూఢిల్లీ : ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన లోక్ సభ సచివాలయం నుంచి రావలసి ఉంది. ఆయన దోషి అని గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేయడంతో ఆయన పార్లమెంటులో తన గళాన్ని వినిపించే అవకాశం మళ్లీ రాబోతోంది. 2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ దోషి అని తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో, ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే.

దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై పూర్ణేశ్ మోదీ గుజరాత్‌లోని సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు గాంధీని దోషిగా తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. ఆయనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపేసింది.


సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాల్లో, ట్రయల్ జడ్జి ఈ కేసులో విధించదగిన గరిష్ఠ శిక్షను విధించారని, శిక్షాకాలం కనీసం ఒక రోజు తగ్గినా, లోక్ సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడి ఉండేది కాదని వ్యాఖ్యానించింది. సూరత్‌ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కూడా ఇదే వాదన వినిపించారు. పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ కోర్టు తనకు విధించిన శిక్ష తప్పు అని, ఆమోదయోగ్యం కాదని చెప్పారు. లోక్ సభ సభ్యత్వానికి తాను అనర్హుడనయ్యే విధంగా ఈ తీర్పు ఉందని ఆరోపించారు.

రాహుల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదనడంలో ఎలాంటి సందేహం లేదని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగంగా మాట్లాడేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపింది. లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా చేయడం వల్ల పర్యవసానాలు కేవలం ఓ వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయవని, ఆ ప్రభావం ప్రజలపై కూడా ఉంటుందని స్పష్టం చేసింది.

రాహుల్ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ, రాహుల్ నిర్దోషిగా విడుదలకావడానికి, పార్లమెంటుకు హాజరవడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇదే చివరి అవకాశమని తెలిపారు. హైకోర్టు తీర్పును 66 రోజులపాటు రిజర్వు చేసిందని, ఆయన దోషి అనే తీర్పు కొనసాగుతున్నందువల్ల ఆయన రెండు పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోయారని తెలిపారు.


విచారణ ప్రారంభంలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, దోషిత్వ తీర్పును నిలిపేయడానికి రాహుల్ గాంధీని ప్రత్యేకంగా చూడాలా? అని అడిగారు. దీనికి సింఘ్వి బదులిస్తూ, తాను ఈరోజు దోషిత్వం గురించి వాదించడం లేదన్నారు. పరువు నష్టం కేసు దాఖలు చేసిన పూర్ణేశ్ మోదీ అసలు ఇంటి పేరు మోదీ కాదన్నారు. తన అసలు ఇంటి పేరు మోదీ కాదని ఆయనే చెప్పారన్నారు. ఆయన మోధ్ వానికా సమాజానికి చెందినవారని చెప్పారు. రాహుల్ ప్రస్తావించిన పేరుగలవారిలో కనీసం ఒక్కరైనా ఆయనపై దావా వేయలేదని గుర్తు చేశారు. 13 కోట్ల మంది ఉన్న ఈ చిన్న సముదాయంలోని బాధితుల్లో, దావా వేసేవారు కేవలం బీజేపీ ఆఫీస్ బేరర్లే కావడం ఆసక్తికరమైన విషయమని తెలిపారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, రాహుల్ గాంధీకి నేరపూరిత చరిత్ర ఉందని ట్రయల్ కోర్టు ప్రస్తావించింది కదా? అని ప్రశ్నించింది. దీనికి సింఘ్వి బదులిస్తూ, 13 కేసులను ప్రస్తావించారని, కానీ వాటిలో ఏ కేసులోనూ ఆయన దోషి అని తీర్పు రాలేదని చెప్పారు. ఈ కేసులను చూపించి, ఆయనకు నేరపూరిత చరిత్ర ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. కేసులన్నిటినీ బీజేపీ కార్యకర్తలే దాఖలు చేశారన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సమాజానికి వ్యతిరేకంగా చేసినవి కాదన్నారు. కిడ్నాప్, రేప్, మర్డర్ వంటి నేరాలు కాదన్నారు. అయినప్పటికీ గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష విధించారన్నారు. ఇది నైతిక పతనానికి సంబంధించిన నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇటువంటి కేసుల్లో రెండేళ్ల జైలు శిక్ష విధించిన కేసు ఏదీ లేదన్నారు.

తాను నేరం చేయలేదని, సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును, విధించిన శిక్షను నిలిపేయాలని రాహుల్ గాంధీ బుధవారం సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడానికి తనకు అవకాశం కల్పించాలని కోరారు.


ఇవి కూడా చదవండి :

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియ.. శిథిలాల్లో 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన..

Updated Date - 2023-08-04T15:00:43+05:30 IST