Ramesh Bidhuri Row: డానిష్ అలీని కలిసిన రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2023-09-22T20:49:05+05:30 IST
బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ లోక్‌సభలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల దుమారం తగ్గుముఖం పట్టలేదు. ఈ నేపథ్యంలో డానిష్ అలీని ఆయన నివాసంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ శుక్రవారం కలుసుకున్నారు.
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎంపీ డానిష్ అలీ (Danish Ali)పై బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ (Ramesh Bidhuri) లోక్‌సభలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల దుమారం తగ్గుముఖం పట్టలేదు. ఈ నేపథ్యంలో డానిష్ అలీని ఆయన నివాసంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ శుక్రవారం కలుసుకున్నారు. రమేష్ బిధూడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ రాసిన కొద్దిగంటలకే ఆయనను రాహుల్ కలుసుకోడవం ప్రాధాన్యత సంతరించుకుంది.
లోక్‌సభకు రాజీనామా చేస్తా...
బీజేపీ ఎంపీ బిధూడీపై చర్యలు తీసుకోని పక్షంలో లోక్‌సభ సభ్యత్వం నుంచి వైదొలిగే విషయాన్ని పరిశీలిస్తానని శుక్రవారం ఉదయం డానిష్ అలీ స్పీకర్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 'ముల్లా టెర్రరిస్ట్' అంటూ బిధూడీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపగా, ఈ వ్యాఖ్యలు లోక్‌సభ రికార్డుల్లో నమోదయ్యాయని, స్పీకర్‌గా మీ నేతృత్వంలో కొత్త పార్లమెంటు భవనంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఓంబిర్లాకు రాసిన లేఖలో అలీ పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీగా, ఒక మైనారిటీ సభ్యుడిగా ఈ పరిణామం తనకెంతో ఆవేదన కలిగించిందని, సభా నిబంధనల ప్రకారం 227వ నిబంధన కింద ఈ అంశంపై విచారణ జరిపించి నివేదికకు ఆదేశించాలని, బీజేపీ ఎంపీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆయన కోరారు. తగిన చర్యలు తీసుకున్నప్పుడే ఈ తరహా వాతావరణంలో దేశంగా బలపడకుండా చూసినట్టవుతుందన్నారు.
కాగా, బిధూడీ వ్యాఖ్యలను ఓం బిర్లా తీవ్రంగా పరిగణించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్లమెంటరీ రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం బిధూడీ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బిధూడీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షోకాజ్ నోటీసు పంపారు.