Rahul Gandhi Vs Nirmala Sitharaman : అదానీ-కాంగ్రెస్ గుట్టు బయటపెట్టిన నిర్మల సీతారామన్
ABN , First Publish Date - 2023-04-06T15:20:58+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పదే పదే నిరాధారమైన
బెంగళూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పదే పదే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) మండిపడ్డారు. 2019లో జరిగిన ఎన్నికలకు ముందు రాహుల్ ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు కూడా అటువంటి ఆరోపణలు చేస్తున్నారని, ఈ తప్పుడు ఆరోపణల నుంచి ఆయన గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదని దుయ్యబట్టారు.
బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మల మాట్లాడారు. అదానీ గ్రూప్‌పై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, మోదీపై నిరాధార ఆరోపణలు చేయడంలో రాహుల్ గాంధీ మళ్లీ మళ్లీ నేరాలు చేసే నేరస్థుడని ఆరోపించారు. అదానీకి అనుచిత ప్రయోజనాలను మోదీ కల్పించారని రాహుల్ అనుకుంటే, అది నిజం కాదన్నారు. 2019లో జరిగిన ఎన్నికలకు ముందు ఆయన ఆరోపణలు చేశారని, ఇప్పుడు కూడా అటువంటి ఆరోపణలు చేస్తున్నారని, ఈ తప్పుడు ఆరోపణల నుంచి ఆయన గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదని అన్నారు.
అదానీకి కేరళ ప్రభుత్వం చేసిన అనుచిత మేలు, రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గతంలో కేరళను పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం విఝింజమ్ పోర్టును పళ్లెంలో పెట్టి అదానీకి ఇచ్చిందన్నారు. ఎటువంటి టెండర్ లేకుండానే ఈ పోర్టును అదానీకి ఇచ్చిందని చెప్పారు. దీనిని రద్దు చేయాలని కేరళలోని ప్రస్తుత సీపీఎం ప్రభుత్వాన్ని కోరకుండా అడ్డుకుంటున్నదేమిటని నిలదీశారు.
రాజస్థాన్‌లోని మొత్తం సోలార్ పవర్ ప్రాజెక్టును అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అదానీకి ఇచ్చిందని, దానిని రద్దు చేయాలని కోరకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నదేమిటని ప్రశ్నించారు. 2013లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) విదేశీ పర్యటనలో ఉండగా, ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను నాన్‌సెన్స్ అని రాహుల్ గాంధీ విమర్శించారని, దానిని చింపేసి, చెత్తబుట్టలో పడేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా రాజస్థాన్‌ల్లోని అదానీ ప్రాజెక్టును రద్దు చేయకుండా ఆపుతున్నదేమిటని ప్రశ్నించారు.
ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నవాటి గురించి ఆయన మాట్లాడటం లేదేమని ప్రశ్నించారు. క్రోనీకేపిటలిజం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఉందన్నారు. దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కనీసం ఒక మాట అయినా మాట్లాడటం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తే, ఆయనకు తాను సవాల్ విసురుతున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అన్నారు.
వందసార్లు తప్పుడు ఆరోపణలు చేసి, దానివల్ల ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నారన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ చేసిన ఆరోపణలకు సుప్రీంకోర్టులో ఆయన క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆయన క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు ‘‘నేను గాంధీని, సావర్కర్‌ను కాదు’’ రాహుల్ అంటున్నారని, గతంలో ఆయన స్వయంగా చెప్పిన క్షమాపణల గురించి మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
కర్ణాటకలో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని నిర్మల సీతారామన్ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులను అందజేసిందన్నారు. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లేదా అంతకు తక్కువ స్థాయికి కట్టడి చేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
Pakistani Court : ముస్లిం మహిళలను అనవసరంగా నిందించొద్దు : పాకిస్థాన్ షరియా కోర్ట్