Modi Surname Remark: చిక్కుల్లో పడిన చోటు నుంచే మళ్లీ రాహుల్ ప్రచారం

ABN , First Publish Date - 2023-03-28T19:30:01+05:30 IST

రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై ఓవైపు కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగిస్తుండగా, ఏప్రిల్ 5న కర్ణాటకలోని..

Modi Surname Remark: చిక్కుల్లో పడిన చోటు నుంచే మళ్లీ రాహుల్ ప్రచారం

న్యూఢిల్లీ: రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై ఓవైపు కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగిస్తుండగా, ఏప్రిల్ 5న కర్ణాటక (Karnataka)లోని కోలార్‌(Kolar)లో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు రాహుల్ సిద్ధమవుతున్నారు. ఆసక్తికరంగా, ఇదే కోలార్‌ నుంచి రాహుల్ 2019లో 'మోది' ఇంటిపేరుతో వ్యాఖ్యలు చేయడం, ఇందుకు సంబంధించిన పరువునష్టం కేసులోనే ఆయన ఇటీవల దోషిగా నిరూపణ కావడం, తదనంతర క్రమంలో లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడం జరిగింది.

కోలార్‌లో 2019 ఏప్రిల్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, దొంగలంతా మోదీ పేరుతోనే ఎందుకు ఉంటారో? అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై దాఖలైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఆయనకు ఇచ్చింది. రాహుల్ విజ్ఞప్తిపై బెయిల్ కూడా మంజూరు చేసింది. తీర్పు వెలువడిన కొద్ది గంటలల్లోనే (మార్చి 24) ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి ఉత్తర్వు వెలువడింది. దీంతో ఆయనకు కేటాయించిన అధికారిక బంగ్లా కూడా అదే రోజు నుంచి రద్దయింది. బంగ్లాను ఖాళీ చేయాలని ఈనెల 27న రాహుల్‌కు నోటీసులు కూడా వెళ్లాయి. నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉంటానని రాహుల్ ప్రకటించారు.

Updated Date - 2023-03-28T19:33:48+05:30 IST