Maharashtra Politics: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజ్ థాకరే
ABN , First Publish Date - 2023-07-07T19:51:57+05:30 IST
మహారాష్ట్ర రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా వరుస మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని అడ్డంగా చీల్చి, ఆ పార్టీ తమదేనంటూ అజిత్‌పవార్ ఈసీని ఆశ్రయించిన వ్యవహారం ఇంకా సద్దుమణగక మునుపే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్‌థాకరే శుక్రవారంనాడు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకున్నారు.
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra politics) ఎవరూ ఊహించని విధంగా వరుస మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని (NCP) అడ్డంగా చీల్చి, ఆ పార్టీ తమదేనంటూ అజిత్‌పవార్ ఈసీని ఆశ్రయించిన వ్యవహారం ఇంకా సద్దుమణగక మునుపే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్‌థాకరే (Raj Thackeray) శుక్రవారంనాడు నేరుగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను (Eknath Shinde) కలుసుకున్నారు. వరుసకు సోదరులైన ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే తిరిగి చేతులు కలుపుతారంటూ రెండు మూడు రోజులుగా బలంగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇందుకు భిన్నంగా సీఎంను రాజ్‌థాకరే కలుసుకోవడం శివసేన ఉద్ధవ్ వర్గం ఉలిక్కిపడేలా చేసింది.
ఏక్‌నాథ్ షిండే నివాసంలో ఆయనను రాజ్‌థాకరే కలుసుకున్నారు. ఉభయులూ 20-25 నిమిషాల సేపు మాట్లాడుకున్నారు. అయితే, ఏం అంశం మీద వీరు మాట్లాకున్నారనేది వెంటనే తెలియలేదు. గతంలో ఇద్దరు నేతలను దగ్గర చేసేందుకు రెండు పార్టీల నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంభాషణలు మాత్రం జరగలేదు.
ఇక, ఉద్ధవ్ థాకరే చేతిలో తాను గతంలో రెండు సార్లు మోసపోయాననే అభిప్రాయం రాజ్ థాకరేలో ఉంది. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్ థాకరే, ఉద్ధవ్ శివసేన తిరిగి కలిసి పనిచేయాలని ఉద్ధవ్ వర్గం నేతలు కోరుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా ఉద్ధవ్, రాజ్ ఫోటోలతో పెద్దపెద్ద బ్యానర్లు కూడా ముంబైలో వెలిసాయి. ఇద్దరూ సోదరులే కాబట్టి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, వారి మధ్య చాలాకాలంగా అనుబంధం ఉందని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం కూడా త్వరలోనే ఇద్దరి మధ్యా సయోధ్య కుదరనుందనే అభిప్రాయాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా సీఎం షిండేను రాజ్ థాకరే కలుసుకున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏమి జరగుతోందో తెలియని అయోమయం ఆయా పార్టీ నేతల్లో నెలకొంది.
శరద్ పవర్ హస్తంపై రాజ్ వ్యాఖ్యలు
అజిత్ పవార్ 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి శివసేన-బీజేపీ ప్రభుత్వంలో గత ఆదివారం చేరడం వెనుక శరద్ పవార్ హస్తం ఉందని రాజ్ థాకరే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు చాలా విసుగుపుట్టిస్తున్నాయని, ఇది కచ్చితంగా రాష్ట్రంలోని ఓటర్లను అవమానించడమేనని ఆయన అన్నారు. 1978లో ఈ తరహా వ్యవహారాలకు ఆద్యుడు శరద్ పవారేనని, పవార్‌తోనే ముగింపు అని అన్నారు. సీనియర్ పవార్ ఆశీస్సులు లేకుండా అజిత్ పవార్ వెనుక ప్రఫుల్ పటేల్, దిలీప్ వాస్తే పాటిల్, ఛగన్ భుజ్‌బల్ వెళ్లేవారు కాదని కూడా రాజ్ అనుమానాలు వ్యక్తం చేశారు.