Rajasthan : రానున్న రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-10T11:13:10+05:30 IST
ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలుపు అవకాశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్
న్యూఢిల్లీ : ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలుపు అవకాశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ (Rajasthan Chief Minister Ashok Gehlot) కొట్టిపారేశారు. ఎన్నికల్లో బీజేపీ అనుసరించే వ్యూహం సరైనది కాదని, కర్ణాటకలో ఆ విషయం రుజువైందని, రాజస్థాన్‌లో కూడా అదే జరుగుతుందని చెప్పారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజల మనసు గెలుచుకునేందుకు బీజేపీ మతపరమైన సున్నితమైన ప్రకటనలు చేస్తుందన్నారు. ఇది కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సత్ఫలితాలు ఇవ్వలేదని, రాజస్థాన్‌లో కూడా ఆ పార్టీ పతనమవుతుందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయినా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయినా మతపరమైన నినాదాలు చేస్తారన్నారు. ఈసారి ఇవేవీ పని చేయవన్నారు. కర్ణాటకలో బజరంగ్ బలి అని నినాదాలు చేశారని, కానీ బీజేపీకి ఆ నినాదాల వల్ల ఫలితం రాలేదని చెప్పారు. అలాంటి నినాదాలు చేయడం చాలా తప్పు అన్నారు. ఎన్నికల ప్రచారం చేయకుండా మోదీని నిలువరించాలని తాను ఎన్నికల కమిషన్‌ను కోరానని చెప్పారు. ఇది ఓ రకమైన నేరం అని మండిపడ్డారు. ఇది వారి స్వభావంలోనే ఉందని, వారు ఏమైనా చేయగలరని దుయ్యబట్టారు.
రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఎదురొడ్డి నిలిచేందుకు తమ పార్టీ (కాంగ్రెస్) పరిపాలన మౌలిక సదుపాయాలే అండగా నిలుస్తాయన్నారు. గడచిన ఐదేళ్ళలో తమ పరిపాలన తీరే తమను గెలిపిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, తాగునీరు, మహిళల సంక్షేమం, రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను తమ ప్రభుత్వం నిర్వహించిందన్నారు. 1 లక్ష కిలోమీటర్ల మేరకు రోడ్లు వేస్తామని, ఇప్పటికే 56 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) గురించి అడిగిన ప్రశ్నకు అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సుఖ్‌జిందర్ సింగ్ రణధవాల పర్యవేక్షణలో సచిన్ పైలట్, తాను మాట్లాడుకున్నామని చెప్పారు. తాము ఏం మాట్లాడుకున్నదీ ఇప్పుడు చెప్పబోనన్నారు. చర్చలను ప్రారంభించినపుడు, ఏదైనా మాట్లాడితే అపార్థాలు రావచ్చునన్నారు. ఇది పార్టీ అంతర్గత విషయం కాబట్టి దీని గురించి ప్రశ్నలు అడగవద్దని కోరారు. పైలట్ కోరుతున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే సింథియాపై చర్యలకు తాను సిద్ధమేనని చెప్పారు. వసుంధరపై తాము చేసిన ఆరోపణలన్నీ న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆరోపణలేమిటో స్పష్టంగా ఎవరు చెప్పినా తాను చర్యలు తీసుకుంటానన్నారు.
ఇవి కూడా చదవండి :
Donald Trump : ట్రంప్‌పై కేసు.. ఆయన ఏమేం దాచిపెట్టారంటే..
Amazon rainforest : కూలిన విమానం.. గల్లంతైన నలుగురు బాలలు.. 40 రోజుల తర్వాత సజీవంగా..