Rajya Sabha : చాలించండి నాటక ప్రదర్శనలు.. టీఎంసీ ఎంపీపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం..
ABN , First Publish Date - 2023-07-28T16:02:17+05:30 IST
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘర్షణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘర్షణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. చివరికి సభ అర్థాంతరంగా వాయిదా పడింది.
రాజ్యసభలో అన్ని కార్యకలాపాలను వాయిదా వేసి, తాము లేవనెత్తిన అంశంపై చర్చించాలని కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, ఎస్పీ, ఆప్, ఎన్‌సీపీ, డీఎంకే పార్టీలకు చెందిన 47 మంది ఎంపీలు శుక్రవారం ఉదయం రూల్ 267 ప్రకారం నోటీసులు ఇచ్చారు. అయితే సభ ప్రారంభమైన వెంటనే ఇద్దరు సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న బీజేపీ ఎంపీ వినయ్ దినుర్ టెండూల్కర్‌కు వీడ్కోలు పలికింది. అనంతరం రూల్ 267 ప్రకారం నోటీసులిచ్చిన ఎంపీల పేర్లను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ చదివారు. సభ్యులు లేవనెత్తిన అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలిపానని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా స్వల్ప కాలిక చర్చలో పాల్గొనాలని కోరారు. ప్రజలకు స్ఫూర్తిదాయకంగా సభ్యులు ప్రవర్తించాలని కోరారు. ప్రతిరోజూ ఒకే విధమైన పరిస్థితి కొనసాగడం వల్ల సభ్యులకు దక్కవలసిన గౌరవం లభించదన్నారు. తాను అనేక విధాలుగా సమాచారాన్ని సేకరించానని, ఈ సమాచారం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు.
వరుసగా ప్రతి సమావేశాల్లోనూ, ప్రతి రోజూ రూల్ 267 ప్రకారం అనేక నోటీసులు వస్తున్నాయన్నారు. గడచిన 23 ఏళ్లలో ఇలాంటి ఎన్ని నోటీసులకు అనుమతి లభించిందో ఈ సభకు తెలుసునని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం చాలా ముఖ్యమైనదని, ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతారని చెప్పారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు ప్రశ్నోత్తరాల సమయం హృదయం వంటిదని తెలిపారు.
దీంతో డెరెక్ ఒబ్రెయిన్ స్పందిస్తూ, ‘‘ఇదంతా మాకు తెలుసు’’ అన్నారు. ఈ సమావేశాలు ప్రాంభమైనప్పటి నుంచి మణిపూర్ సమస్య గురించి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని, దానిని చేపట్టాలని డిమాండ్ చేశారు.
జగదీప్ ధన్‌కర్ స్పందిస్తూ, ‘‘దీని గురించి మీకు తెలుసునని నాకు తెలుసు. మీరు చెప్పనక్కర్లేదు. కేవలం వినండి చాలు. మీరు వింటే, మీకు అర్థమవుతుంది’’ అని అన్నారు. కానీ ఒబ్రెయిన్ వెనుకంజ వేయలేదు. అప్పుడు ఆయనను తన స్థానంలో కూర్చోవాలని ధన్‌కర్ కోరారు.
‘‘మిస్టర్ డెరెక్ ఒబ్రెయిన్, నాటకీయ ప్రదర్శనలు చేయడం మీకు అలవాటుగా మారింది. ప్రతిసారీ మీరు లేచి నిలబడతారు, అది మీ విశేష అధికారంగా భావిస్తారు. సభాపతి స్థానాన్ని గౌరవించడం మీ కనీస కర్తవ్యం. నేను ఏం చెప్పినా, మీరు లేచి, నాటక ప్రదర్శనలు చేస్తారు’’ అని మండిపడ్డారు.
ఒబ్రెయిన్ అభ్యంతరం
జగదీప్ ధన్‌కర్ వ్యాఖ్యలపై స్పందించిన ఒబ్రెయిన్ మాట్లాడుతూ, ఆయన ముందు ఉన్న బల్లపై గట్టిగా కొడుతూ, తాను నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నానని చెప్పారు.
దీంతో ధన్‌కర్ స్పందిస్తూ, ‘‘బల్ల మీద కొట్టకండి. దాన్ని కొట్టకండి. ఇది రంగస్థలం కాదు’’ అన్నారు. ‘‘మేం దీనిని సహించం, ఐయామ్ సారీ’’ అన్నారు. ః
ఒబ్రెయిన్ ఏదో చెప్పబోతుండగా, ధన్‌కర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ‘‘దీనిని మేం భరించలేం’’ అని అంటూ సభ నుంచి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి :
Manipur : మణిపూర్ వీడియో లీకేజ్ వెనుక కుట్ర : అమిత్ షా