Corrupt Lingayat CM: వివాదంలో సిద్ధరామయ్య...వెంటనే వివరణ..!

ABN , First Publish Date - 2023-04-23T19:21:10+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య వివాదంలో..

Corrupt Lingayat CM:  వివాదంలో సిద్ధరామయ్య...వెంటనే వివరణ..!

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) వివాదంలో చిక్కుకున్నారు. ''అవినీతి లింగాయత్ సీఎం'' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించగా, సిద్ధరామయ్య వెంటనే తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు కేవలం బసవరాజ్ బొమ్మైని ఉద్దేశించినవి మాత్రమేనని, గతంలోని లింగాయత్ సీఎంలంటే తనకెంతో గౌరవం ఉందని అన్నారు. తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందంటూ మండిపడ్డారు.

లింగాయత్‌ సామాజిక వర్గానికే చెందిన వారినే తదుపరి సీఎం చేసేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉందనే విషయాన్ని సిద్ధరామయ్య దృష్టికి మీడియా తీసుకురావడంతో ఇప్పుడు ఉన్నది కూడా లింగాయత్ ముఖ్యమంత్రేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని అవినీతి అంతటికీ ఆయనే (బసవరాజ్ బొమ్మై) మూలమని అన్నారు. దీనిపై బీజేపీ వెంటనే స్పందించింది. లింగాయత్ సామాజిక వర్గాన్నే సిద్ధరామయ్య అవమానించారంటూ మండిపడింది. మాజీ సీఎం ఇలాంటి ప్రకటన చేయడం సరికాదని, లింగాయత్ సామాజిక వర్గమంతా అవినీతిమయమేనని సిద్ధరామయ్య చెబుతున్నారని, గతంలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా ఆయన అవమానించారని సీఎం బొమ్మై అన్నారు. గతంలోనూ సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు లింగాయత్ వీరశైవ సామాజిక వర్గాన్ని విభజించే ప్రయత్నం చేశారని, రాష్ట్ర ప్రజలే ఆయనకు గుణపాఠం చెబుతున్నారని ఎదురుదాడి చేశారు.

సిద్ధరామయ్య వివరణ...

సీఎం స్పందించిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. అవినీతి సీఎం వ్యాఖ్య కేవలం ముఖ్యమంత్రిని బొమ్మైని ఉద్దేశించి చేసినట్టు తెలిపారు. తక్కిన లింగాయత్ సీఎంల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, అయితే తన మాటలకు బీజేపీ వక్రీకరించిందని వివరణ ఇచ్చారు. నిజాయితీగా పనిచేసిన ఎస్.నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ వంటి ముఖ్యమంత్రులు గతంలో ఉన్నారని చెప్పారు.

Updated Date - 2023-04-23T19:21:10+05:30 IST