Sanjay Raut: రూ.2000 కోట్లు చేతులు మారాయి.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ
ABN , First Publish Date - 2023-02-19T14:06:17+05:30 IST
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీ ప్రధాన ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. 'శివసేన' పార్టీ పేరు, 'విల్లు-బాణం' గుర్తు విషయంలో...
ముంబై: ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీ ప్రధాన ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు. 'శివసేన' పార్టీ పేరు, 'విల్లు-బాణం' గుర్తు విషయంలో రూ.2,000 కోట్లు చేతులు మారాయని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన చీలిక వర్గానికి పార్టీ పేరు, గుర్తు చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మరుసటి రోజే సంజయ్ రౌత్ ఈ సంచలన ఆరోపణలు చేయడం విశేషం. ఈ మేరకు హిందీ, మరాఠీలో రెండు ట్విటర్ పోస్టులు చేశారు. తన ట్వీట్‌ను ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ), భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి ట్యాగ్ చేశారు. ఆదివారంనాడు జరిగిన మీడియా సమావేశంలోనూ మరోసారి ఇదే ఆరోపణ చేశారు.
''నేను నిశ్చయంగా చెప్పగలను. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు పొందేందుకు ఇంతవరకూ రూ.2,000 కోట్లు చేతులు మారాయి. ఇది తొలి లెక్క (ఇనీషియల్ ఫిగర్) మాత్రమే. ఇది వంద శాతం నిజం. అతి త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయి. దేశ చరిత్రలోనే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు'' అని సంజయ్ రౌత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రనేనని మీడియా ముందు కూడా ఆయన తెలిపారు. పూర్తి సమాచారంతో, బాధ్యతాయుతంగా తాను ఈ విషయం చెబుతున్నానని అన్నారు. ఈ డీల్‌లో రూ.50 కోట్లు కార్పొరేటర్లకు, రూ.50 కోట్లు ఎమ్మెల్యేలకు, రూ.100 కోట్లు ఎంపీలకు చేతులు మారాయన్నారు. పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్లు చేతులు మారాయంటే విషయం అర్ధం చేసుకోవచ్చనీ, ఇదేమంత చిన్న మొత్తం కూడా కాదని అన్నారు. ఈసీ నిర్ణయం ఒక డీల్ అని చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక బిల్డర్ నుంచి తనకు ఈ సమాచారం వచ్చిందని అన్నారు. కాగా, సంజయ్ రౌత్ ఆరోపణలపై బీజేపీ నుంచి కానీ, షిండే వర్గం నుంచి తక్షణ స్పందన రాలేదు.
గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే వర్గం అప్పటి మహా వికాశ్ అఘాడి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేలలో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపు తిప్పుకున్నారు. దీంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే బీజేపీతో షిండే పొత్తుపెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీ గుర్తు, పేరు తమకే చెందాలంటూ ఉద్ధవ్, షిండే వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. దాదాపు ఎనిమిది నెలల హైడ్రామాకు కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం తెరదించింది. షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎక్కువ మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇది పార్టీ సాధించిన ఓట్లలో 76 శాతమని తెలిపింది. 23.5 శాతం మందే ఉద్ధవ్ వైపు ఉన్నట్టు 78 పేజల ఆదేశాల్లో ఈసీ స్పష్టం చేసింది.