RS Bharati: అవి ఆధారాలు లేని అసత్యాలు.. ఆయనపై చట్టప్రకారం చర్యలు

ABN , First Publish Date - 2023-04-15T08:45:45+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధినేత అన్నామలై(BJP state president Annamalai) వెల్లడించిన డీఎంకే నాయకుల ఆస్తుల వివరాలు నిరాధారమైనవని, తప్పుడు

RS Bharati: అవి ఆధారాలు లేని అసత్యాలు.. ఆయనపై చట్టప్రకారం చర్యలు

- డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధినేత అన్నామలై(BJP state president Annamalai) వెల్లడించిన డీఎంకే నాయకుల ఆస్తుల వివరాలు నిరాధారమైనవని, తప్పుడు సమాచారం వెలువరించిన ఆయనపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టనున్నామని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharati) హెచ్చరించారు. తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... డీఎంకే(DMK) మంత్రులు, ప్రముఖుల అవినీతి చిట్టా విప్పుతానంటూ గొప్పలు చెప్పిన అన్నామలై ప్రస్తుతం అవినీతి ఆరోపణలు చేయకుండా ఆస్తుల వివరాలంటూ తప్పుడు సమాచారం అందించి, అందరి సమయాన్ని వృథా చేశారని తెలిపారు. అన్నామలై అతితెలివిని చూస్తుంటే ఆయన ఐపీఎస్‌ ఎలా అయ్యారనే అనుమానం కలుగుతోందన్నారు. అన్నామలై జాబితాలో పేర్కొన్న 12 మంది ఇదివరకే ఎన్నికల్లో పోటీ చేసిన వారని, వారంతా నామినేషన్‌ అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు సమర్పించారని, అందులో ఏవైనా తప్పుడు సమాచారం ఉంటే సాధారణ వ్యక్తి కూడా కేసు వేయగలుగుతాడని చెప్పారు. అన్నామలై భేటీ పూర్తిగా మోసపుచ్చే విధంగానే ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత పలుమార్లు డీఎంకే నేతలపై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై అవినీతి ఆరోపణలు చేసి రుజువు చేయలేక పోయారని, అన్నామలై చేసిన ఆరోపణలపై చట్టప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. డీఎంకేకు రూ.1408 కోట్ల మేరకు ఆస్తులున్నాయని అన్నామలై చేసిన ఆరోపణను రుజువు చేయగలరా అని ఆర్‌ఎస్‌ భారతి ప్రశ్నించారు. 15 రోజులలోపున ఆ ఆస్తులకు సంబంధించిన పత్రాల నకళ్లను అన్నా అరివాలయంలో అన్నామలై సమర్పించాలని లేకుంటే చర్యలు చేపడతామన్నారు. ఇక ఆరుద్ర సంస్థ అవినీతితో అన్నామలైకి సంబంధం ఉందని, ఆ సంస్థ నుంచి రూ.84 కోట్ల మేరకు ముడుపులు స్వీకరించారని ఆర్‌ఎస్‌ భారతి ఆరోపించారు.

hhhhh.jpg

Updated Date - 2023-04-15T08:45:45+05:30 IST