RS Bharti: ఉన్నమాటంటే మీకు అంత ఉలుకెందుకో..?
ABN , First Publish Date - 2023-11-07T11:02:25+05:30 IST
ఇటీవల జరిగిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకల సభలో తాను నాగాలాండ్ ప్రజలను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు
- నాగాలాండ్ ప్రజలను ఎక్కడా కించపరచలేదు
- గవర్నర్‌కు ఆర్‌ఎస్ భారతి సమాధానం
చెన్నై: ఇటీవల జరిగిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకల సభలో తాను నాగాలాండ్ ప్రజలను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి(RS Bharti)... రాష్ట గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi)కి సమాధానమిచ్చారు. ఆదివారం ట్విట్టర్ పేజీలో ఆర్‌ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలు తన రాష్ట్రమైన నాగాలాండ్ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని, వారి ధైర్యసాహసాల గురించి తెలియకపోవడం గర్హనీయమని గవర్నర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నాగాలాండ్(Nagaland) ప్రజలు శునక మాంసం ఆరగిస్తారని కూడా విమర్శించడం సహించరాని విషయమంటూ గవర్నర్ మండిపడ్డారు. గవర్నర్ వెలువరించిన ట్వీట్ సందేశానికి ఆర్‌ఎస్ భారతి సోమవారం బదులిస్తూ... నాగాలాండ్ ప్రజలను తన ప్రసంగంలో ఎక్కడా కించపరచలేదన్నారు. తన ప్రసంగంలో శునక మాంసం తినే నాగాలాండ్ ప్రజలంతా గవర్నర్ రవిని తరిమికొట్టినప్పుడు లవణ అన్నం ఆరగించే తమిళులకు అంతటి రోషం ఉండదా? అని మాత్రమే పేర్కొన్నానని స్పష్టం చేశారు. పైగా నాగాలాండ్ ప్రజలు శునక మాంసం ఆరగిస్తారంటూ తాను కొత్తగా చెప్పలేదని శునక మాంసం భుజించటం నాగాలాండ్ వాసుల సంస్కృతిలో భాగమని గౌహతి హైకోర్టు తీర్పును వెలువరించిందని గుర్తు చేస్తున్నట్లు ఆర్‌ఎస్ భారతి ట్విట్టర్ పేజీలో ఘాటుగా సమాధానమిచ్చారు.