Doval and Putin : అజిత్ దోవల్‌తో ముఖాముఖీ కోసం పుతిన్ అవస్థలు

ABN , First Publish Date - 2023-02-11T15:48:00+05:30 IST

మన దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval)తో ముఖాముఖి చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్

Doval and Putin : అజిత్ దోవల్‌తో ముఖాముఖీ కోసం పుతిన్ అవస్థలు
Vladimir Putin, Ajit Doval

మాస్కో : మన దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval)తో ముఖాముఖి చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరువురు తమ భావాలను పంచుకున్నారు. ఈ వివరాలు మూడో కంటికి తెలియకూడదనే ఉద్దేశంతో వీరు ఉన్న గది నుంచి ఇతర ప్రతినిధులు, అధికారులను ఖాళీ చేయించారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను వెల్లడించింది.

పుతిన్, దోవల్ ఈ నెల 9న మాస్కోలో సమావేశమయ్యారు. మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ఇచ్చిన ట్వీట్‌లో, ఇరు దేశాల మధ్యగల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం నిరంతర కృషిని కొనసాగించాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, దోవల్‌తో ముఖాముఖి సమావేశం ప్రారంభమవడానికి ముందు ఆ గదిలో ఉన్నవారినందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని పుతిన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ గదిలో దోవల్, పుతిన్ మాత్రమే ఉన్నారని, ఇరువురు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారని, తమ తమ భావాలను పంచుకున్నారని సమాచారం. ఈ అరుదైన సమావేశం పుతిన్ చొరవతో జరిగినట్లు తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్థాన్‌పై భద్రతా మండళ్ల కార్యదర్శుల/ఎన్ఎస్ఏల సమావేశాన్ని బుధవారం రష్యా నిర్వహించింది. ఇరాన్, కజఖ్‌స్థాన్, కిర్గిజ్‌స్థాన్, చైనా, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్ భూభాగాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని ఏ దేశానికీ ఇవ్వకూడదన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు అవసరమైనపుడు తాము వారికి అండగా నిలుస్తామని తెలిపారు.

న్యూఢిల్లీలోని రష్యన్ రాయబారి డెనిస్ అలిపోవ్ సోమవారం మాట్లాడుతూ, భారత దేశంతో రష్యా సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మూడు నెలల క్రితం రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత దేశానికి రష్యా నుంచి చమురు దిగుమతులు సహా ఆర్థిక రంగంలో సంబంధాలను మరింత పెంచుకోవాలని నిర్ణయించాయి.

న్యూఢిల్లీలో జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశాలు మార్చి 1, 2 తేదీల్లో జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ హాజరయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-02-11T15:48:04+05:30 IST