Make in India : మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు
ABN , First Publish Date - 2023-06-30T09:06:26+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మోదీని రష్యాకు గొప్ప మిత్రునిగా ఆయన అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్‌వర్క్ ఈ వివరాలను వెల్లడించింది.
మాస్కో : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) ప్రశంసించారు. మోదీని రష్యాకు గొప్ప మిత్రునిగా ఆయన అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్‌వర్క్ ఈ వివరాలను వెల్లడించింది.
మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ, రష్యాలో ఆ దేశ ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రోత్సహించడం కోసం భారత దేశాన్ని ఉదాహరణగా చూపించారు. ‘‘భారత దేశంలోని మన మిత్రులు, రష్యాకు గొప్ప మిత్రుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని సంవత్సరాల క్రితం ‘మేక్ ఇన్ ఇండియా’ అనే కాన్సెప్ట్‌ను సమర్పించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది’’ అన్నారు.
రష్యా జాతీయ దినోత్సవాల సందర్భంగా ఆ దేశ రాయబారి డెనిస్ అలిపోవ్‌కు ఇటీవల న్యూఢిల్లీలో ప్రభుత్వ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా డెనిస్ మాట్లాడుతూ, రష్యా- భారత దేశ వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. ఇది తన సత్తాను చాటుతోందని, ఎప్పటిలాగాన నిరంతరం మరింత బలోపేతమవుతోందని చెప్పారు. రష్యా గురించి ప్రతి రోజూ, అంతర్జాతీయ స్థాయిలో అబద్ధాలు ప్రచారమవుతున్నాయని, రష్యా-భారత్ సంబంధాలను చెడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
‘మేక్ ఇన్ ఇండియా’ అంటే..
పెట్టుబడులు, నవ కల్పన (Innovation)లను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధిని విస్తరించడం, తయారీ రంగంలో అత్యుత్తమమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ‘మేక్ ఇన్ ఇండియా’ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2022 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటాను 16 శాతం నుంచి 25 శాతానికి పెంచాలని, అదనంగా 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుని దీనిని ప్రారంభించింది. పట్టణ పేదలకు, గ్రామీణ వలసదారులకు తగిన నైపుణ్యాలను నేర్పించడం కోసం దీనిని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి. అవి.. నూతన ఆలోచనా విధానం, నూతన రంగాలు, నూతన మౌలిక సదుపాయాలు, నూతన ప్రక్రియలు.
ఇవి కూడా చదవండి :
Congress party PhonePe: కాంగ్రెస్ పార్టీకి ఫోన్‌పే హెచ్చరిక.. కారణం ఏంటో తెలుసా...
Drone Police Unit: రాష్ట్ర హోం శాఖ చరిత్రలో మరో మైలురాయి.. డ్రోన్ పోలీస్ యూనిట్