UP:ఆదిలోనే హంసపాదు.. 65 లోక్ సభ స్థానాల్లో ఎస్పీ పోటీ.. ఇండియా కూటమికి 15 సీట్లే!
ABN , First Publish Date - 2023-11-02T15:57:10+05:30 IST
ఇండియా కూటమి(INDIA Alliance) లో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్ఫష్టం చేసింది.
లఖ్‌నవూ: ఇండియా కూటమి(INDIA Alliance) లో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్ఫష్టం చేసింది. మిగతా 15 స్థానాలు ఇండియా కూటమిలోని కాంగ్రెస్(Congress) , తదితర పార్టీలకు విడిచిపెడుతున్నట్లు చెప్పడం చర్చనీయాంశం అయింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి(Samajwadi Party) కాంగ్రెస్ సీట్లు కేటాయించకపోవడంతో.. ఎస్పీ అధినేత ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాలకుగానూ ఎస్పీ 6 సీట్లు కోరుతోంది. కానీ కాంగ్రెస్ ఎస్పీకి సీట్లు కేటాయించడానికి సుముఖంగా లేదు. దీంతో అఖిలేష్ బహిరంగగానే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
అన్ని పార్టీలకు కలుపుకుపోతామని చెబుతున్న కాంగ్రెస్ మాట తప్పిందని ఆయన వాదన. ఆ పార్టీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ఇలా చేస్తుందని తెలిస్తే ఇండియా కూటమిలో చేరే వారిమే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా కూటమిలో ఒక్క సారిగా లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా యూపీ సీట్ల విషయం ఎస్పీకి, ఇండియా కూటమికి మధ్య గ్యాప్ పెంచిందనే చెప్పుకోవచ్చు. ఏక పక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నా.. మధ్య ప్రదేశ్(Madyapradesh) పరిణామాలను ఎస్పీ గుర్తు చేస్తోంది. అయితే కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ, రాయ్ బరేలీలో అభ్యర్థులను నిలబెట్టకూడదని ఎస్పీ నిర్ణయించింది. ఇండియా కూటమి నేతలు ఎస్పీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే బీజేపీతో ఒంటరి పోరాటానికి సిద్ధమని నేతలు చెబుతున్నారు. 2024లో ప్రధాని మోదీలాంటి బలమైన నేతను ఢీ కొట్టడానికి కూటమి కట్టిన ప్రతిపక్ష నేతలకు అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. గురువారం బిహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టి.. లోక్ సభ ఎన్నికలను పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. ఇండియా కూటమిలో వ్యవహారాలు బీజేపీకి ఉపయోగకరంగా మారుతాయని.. ఇప్పటికైనా కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో(Lokh Sabha Elections) గెలిపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. కాంగ్రెస్, ఎస్పీకి మధ్య జరుగుతున్న వివాదంలో ఆయన తాజా వ్యాఖ్యలు కూటమిలో చర్చనీయాంశం అయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే ఇండియా కూటమి పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మారిందని పొలిటికల్ నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు.