Supreme court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌కు రెండు గడువులు విధించిన సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2023-10-30T15:14:03+05:30 IST
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ శివసేన వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఎడతెగని జాప్యం చేస్తుండటంతో ఇప్పటికే రెండుసార్లు తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31వ తేదీలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది.
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ శివసేనకు (Shiv sena) చెందిన రెండు వర్గాలు విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) ఎడతెగని జాప్యం చేస్తుండటంతో ఇప్పటికే రెండుసార్లు తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు (Supreme court) సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. అజిత్ పవార్ వర్గంపై శరద్ పవార్ ఎన్‌సీపీ వర్గం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై కూడా ఇదే సమయంలో నిర్ణయం తీసుకుంది. శివసేన వర్గాల పిటిషన్లపై ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా, ఎన్‌సీపీ వర్గం పిటిషన్లపై 2024 జనవరి 31వ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు గడువు (deadline) విధించింది.
శివసేన వర్గాల క్రాస్-పిటిషన్లపై స్పీకర్ 2024 జనవరి 31వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటారని మహారాష్ట్ర స్పీకర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ, 2023 డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రాజ్యాగంలోని 10వ షెడ్యూల్ పవిత్రతను కాపాడాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రొసీడింగ్స్ మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. జస్టిస్ ఎస్‌బీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు. ఎన్‌సీపీ శరద్ పవార్ గ్రూప్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై కూడా 2024 జనవరి 31వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.