Extreme heatwave : ఉత్తరాదిలో విపరీతమైన వడగాడ్పులు.. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో 98 మంది మృతి..
ABN , First Publish Date - 2023-06-18T11:20:36+05:30 IST
ఉత్తరాది ప్రజలు మూడు రోజుల నుంచి విపరీతమైన వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలు తట్టుకోలేక ఉత్తర ప్రదేశ్‌లో 54 మంది, బిహార్‌లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో చాలా మంది ఆసుపత్రులకు వెళ్లవలసి వస్తోంది. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో అత్యధికులు 60 సంవత్సరాల వయసు పైబడినవారే.
న్యూఢిల్లీ : ఉత్తరాది ప్రజలు మూడు రోజుల నుంచి విపరీతమైన వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలు తట్టుకోలేక ఉత్తర ప్రదేశ్‌లో 54 మంది, బిహార్‌లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో చాలా మంది ఆసుపత్రులకు వెళ్లవలసి వస్తోంది. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో అత్యధికులు 60 సంవత్సరాల వయసు పైబడినవారే.
ఉత్తర ప్రదేశ్‌లోని బాలియాలో జూన్ 15, 16, 17 తేదీల్లో 54 మంది జిల్లా ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో వీరు బాధపడుతున్నట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో వడగాడ్పులు తీవ్రంగా ఉన్నాయన్నారు. అప్పటికే ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నవారికి వడగాడ్పుల వల్ల ఆ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయన్నారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, అతిసార వల్ల మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 15న 23 మంది, 16న 20 మంది, 17 సాయంత్రం నాలుగు గంటల వరకు 11 మంది మరణించినట్లు తెలుస్తోంది. దీంతో మరణ కారణాలపై దర్యాప్తు చేసేందుకు లక్నో నుంచి వైద్యుల బృందాన్ని రప్పిస్తున్నారు. రోగులు, సిబ్బంది వడగాడ్పుల ప్రభావానికి గురి కాకుండా నిరోధించేందుకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దివాకర్ సింగ్ చెప్పారు. రోగులు పెరుగుతుండటంతో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని పెంచినట్లు తెలిపారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, బాలియాలో శుక్రవారం గరిష్ఠంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.
బిహార్‌లో 44 మంది మృతి
బిహార్‌లో 24 గంటల వ్యవధిలో 44 మంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోంది. వీరిలో 35 మంది కేవలం పాట్నాకు చెందినవారే. 18 చోట్ల విపరీతమైన వడగాడ్పులు ప్రజలను బాధించాయి. మరో నాలుగు చోట్ల వడగాడ్పులు ఇబ్బంది పెట్టాయి. శనివారం 11 జిల్లాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బిహార్ రాజధాని పాట్నాలో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. షేక్‌పురలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పాట్నాలో జూన్ 24 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇతర జిల్లాల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఆది, సోమవారాల్లో మరింత తీవ్రత
బిహార్‌లో జూన్ 18, 19 తేదీల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఔరంగాబాద్, రోహ్‌తాస్, భోజ్‌పుర్, బక్సర్, కైమూర్, ఆర్వాల్, పాట్నా, బేగుసరాయ్, ఖగారియా, నలంద, బంక, షేక్‌పుర, జముయి, లఖిసరాయ్ జిల్లాల్లో విపరీతమైన వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది. రెడ్ అలర్ట్ ప్రకటించింది. తూర్పు చంపారన్, గయ, భాగల్‌పూర్, జెహానాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
మధ్య ప్రదేశ్‌లో వేసవి సెలవులు పొడిగింపు
విపరీతమైన వడగాడ్పుల నేపథ్యంలో పాఠశాలలకు జూన్ 30 వరకు వేసవి సెలవులను పొడిగించాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఐదో తరగతి వరకు పూర్తిగా సెలవులు ప్రకటిస్తూ, ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఉదయంపూట పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ప్రకటించింది.
విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లకు హెచ్చరిక
రానున్న ఐదు రోజులపాటు విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో చాలా చోట్ల వడగాడ్పులు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, జార్ఖండ్, కోస్తా ఆంధ్ర, యానాం, బిహార్, గాంజెటిక్ వెస్ట్ బెంగాల్, తెలంగాణ, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లలో వడగాడ్పులు బాధిస్తాయని తెలిపింది. రానున్న మూడు, నాలుగు రోజులపాటు వడగాడ్పులు సాధారణం నుంచి తీవ్ర స్థాయిలో ఉంటాయని, ఆ తర్వాత క్రమంగా వేడి తగ్గుముఖం పడుతుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి
Ajit Doval : నేతాజీ ఉండుంటే దేశం విడిపోయేది కాదు
Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన