Sharad pawar: పీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే కోల్పేయేదేమీ లేదు... 1977 పరిస్థితిని వివరించిన పవార్
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:16 PM
'ఇండియా' కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ప్రతిపాదించినప్పటి నుంచి భాగస్వామ్య పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని ఎన్‌సీపీ సీనియర్ నేత శరద్ పవార్ వ్యక్తం చేశారు. ప్రధాని పేరును ప్రకటించనంత మాత్రాన కోల్పోయేదేమీ ఉండదన్నారు.
న్యూఢిల్లీ: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పేరును తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించినప్పటి నుంచి భాగస్వామ్య పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని ఎన్‌సీపీ సీనియర్ నేత శరద్ పవార్ (Sharad Pawar) వ్యక్తం చేశారు. ప్రధాని పేరును ప్రకటించనంత మాత్రాన కోల్పోయేదేమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు విజయం సాధించినప్పటి పరిస్థితిని ఆయన ఉదహరించారు.
పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో 'ఇండియా' కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేని విషయాన్ని మీడియా ప్రశ్నించినప్పుడు, 1977 నాటి పరిస్థితిని పవార్ గుర్తుచేశారు. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించిన అనంతరం మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవిని చేపట్టారని, ప్రధాని పేరును ముందుగా ప్రకటించనంత మాత్రాన కోల్పోయేది ఏమీ ఉండదని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నందున సమయం వచ్చినప్పుడు మార్పు దిశగా ప్రజలే నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
మహారాష్ట్రలో సర్వేపై..
2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అధికార కూటమి కంటే కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి కూటమి శివసేన ముందంజలో ఉండవచ్చని పోల్ సర్వే పేర్కొనడంపై అడిగినప్పుడు, అదొక సంకేతం మాత్రమేనని, ఇలాంటి సర్వేల ఆధారంగా తుది నిర్ణయానికి రాకూడదని అన్నారు.
ఖర్గే ఏమన్నారు?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 'ఇండియా' కూటమి నాలుగో సమావేశంలో ఖర్గే పేరును ప్రధాన మంత్రి అభ్యర్థిగా మమతా బెనర్జీ ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖర్గే పీఎం అభ్యర్థిత్వానికి ఆప్ సహా 12 పార్టీలు మద్దతు పలికాయి. అయితే, ఈ ప్రతిపాదనను ఖర్గే వెంటనే తోసిపుచ్చారు. పీఎం ఎవరనే విషయాన్ని పక్కనపెట్టి అంతా కలిసికట్టుగా ఎన్నికల విజయంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఎంపీలు లేకుండా పీఎం గురించి చర్చించాల్సిన సమయం ఇది కాదని, కలిసికట్టుగా మెజారిటీ సాధించేందుకు సమష్టిగా ప్రయత్నించాలని ఖర్గే స్పష్టం చేశారు.