Sharad Pawar: ఈసీఐ విచారణకు హాజరుకానున్న శరద్ పవర్
ABN , First Publish Date - 2023-10-01T18:34:06+05:30 IST
నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వివాదం భారత ఎన్నికల కమిషన్ ముందు విచారణకు వస్తోంది. దీనిపై ఈనెల 6వ తేదీన తన వాదనను ఈసీఐ ముందు ఉంచనున్నట్టు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారంనాడు తెలిపారు.
ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక వివాదం భారత ఎన్నికల కమిషన్ (ECI) ముందు విచారణకు వస్తోంది. దీనిపై ఈనెల 6వ తేదీన తన వాదనను ఈసీఐ ముందు ఉంచనున్నట్టు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ఆదివారంనాడు తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎవరనేది ప్రతి ఒక్కరికీ తెలుసునని, తనకు సమన్లు వచ్చినందున ఈసీఐ ముందు విచారణకు హాజరవుతానని ఆయన చెప్పారు.
ఈ ఏడాది జూలై 2న అజిత్ పవార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో ఎన్‌సీపీలో చీలిక ఏర్పడింది. దీంతో ఇటు శరద్ పవార్ వర్గం, అటు అజిత్ వర్గం ఎవరికి వారే పార్టీ తమదేనని ప్రకటించుకున్నారు. పార్టీ పేరు, గుర్తు తమకే కేటాయించాలంటూ ఈసీఐని ఆశ్రయించారు.
మాకే అనుకూలంగా ఉండొచ్చు..
ఈసీఐ విచారణకు హాజరుకానుండటంపై శరద్ పవార్ మరింత వివరణ ఇస్తూ, రాజకీయాల్లో కొందరు తమకు తోచిన నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజాస్వామ్యంలో ఇది వారి హక్కు అని, దీనిపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. అయితే, సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారన్నదే ప్రధానమని అన్నారు. మహారాష్ట్రతో పాటు దేశంలోని అందరికీ ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు ఎవరనేది బాగా తెలుసునని, పరిస్థితి తమకే అనుకూలంగా ఉంటుందని జనం అనుకుంటున్నారని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపిన వాళ్లు ఎంతమాత్రం ఎన్‌సీపీకి చెందిన వారు కాదని, ఈ విషయంలో తాము రాజీపడేది లేదని పవార్ స్పష్టం చేశారు.
'ఇండియా' బ్లాక్ తదుపరి కార్యాచరణపై..
విపక్ష ఐక్యకూటమి "ఇండియా'' తదుపరి కార్యాచరణ ఏమిటనేది కొద్ది రోజుల్లో ఖరారవుతుందని పవార్ చెప్పారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, 2024 ఎన్నికల్లో ఆ మార్పు కనిపిస్తుందని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై కలిసి పోరాడేందుకు 25కు పైగా పార్టీలు చేతులు కలిపాయి. 'ఇండియా' కూటమి ఇంతవరకూ పాట్నా, బెంగళూరు, ముంబైల్లో మూడుసార్లు సమావేశమైంది.