NCP Crisis: ఎన్సీపీ కొత్త చీఫ్‌గా అజిత్...జూన్ 30నే తీర్మానం జరిగిందన్న రెబల్ వర్గం
ABN , First Publish Date - 2023-07-05T21:21:31+05:30 IST
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. అజిత్ పవార్ ఎన్‌సీపీ కొత్త అధ్యక్షుడని ఆయన వర్గం బుధవారంనాడు ప్రకటించింది. జూన్ 30వ తేదీనే శరద్ పవార్‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించినట్టు ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గం నేత సునీల్ టట్కరే తెలిపారు.
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP)లో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. అజిత్ పవార్ ఎన్‌సీపీ కొత్త అధ్యక్షుడని ఆయన వర్గం బుధవారంనాడు ప్రకటించింది. జూన్ 30వ తేదీనే శరద్ పవార్‌ను పార్టీ చీఫ్ పదవి నుంచి తొలగించినట్టు ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గం నేత సునీల్ టట్కరే తెలిపారు. ఈ మేరకు అజిత్ వర్గం ఎన్నికల కమిషన్‌కు బుధవారంనాడు ఒక పిటిషన్ సైతం సమర్పించింది.
ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్థానే అజిత్ పవార్‌ను ఎన్నుకుంటూ జూన్ 30వ తేదీన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించినట్టు ఈసీకి సమర్పించిన పిటిషన్‌లో అజిత్ వర్గం పేర్కొంది.
మీటింగ్ అబద్ధం : శరద్ పవార్
కాగా, జూన్ 30న వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిందంటూ అజిత్ వర్గం చేసిన క్లెయిమ్‌ను శరద్ పవార్ తోసిపుచ్చారు. అలాంటిదేమీ జరగలేదన్నారు. సమావేశం ఏర్పాటు చేసేందుకు తగినంత మంది వర్కింగ్ కమిటీ మెంబర్లు లేరని ఆయన చెప్పారు. పీసీ ఛాకో, సుప్రియా సూలే, జయంత్ పాటాల్, ఫౌజియా ఖాన్ తదతర నేతలకు కూడా ఈ సమావేశం విషయం తెలియదని అన్నారు.