మే 1 నుంచి షిర్డీ నిరవధిక బంద్‌కు కారణం ఏమిటి? ఏం జరుగుతోంది?
ABN , First Publish Date - 2023-04-28T12:21:03+05:30 IST
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఓ చిన్న గ్రామం షిర్డీ. అహ్మద్‌నగర్-మన్మాడ్ హైవేలో షిర్డీ సాయిబాబా ప్రధాన ఆలయం..
షిర్డీ: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఓ చిన్న గ్రామం షిర్డీ (Shirdi). అహ్మద్‌నగర్-మన్మాడ్ హైవేలో షిర్డీ సాయిబాబా ప్రధాన ఆలయం ఉంది. పట్టుమని వంద గడపలు కూడా లేని ఒకప్పటి ఈ కుగ్రామం పేరు.. నేడు రెలిజియస్ టూరిజం డెస్టినేషన్‌గా ఖండాంతరాలకు వ్యాప్తించింది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా లక్షలాది మంది దేశ, విదేశీ భక్తులు, పర్యాటకులు ఏటా షిర్డీలో కొలువైన సాయినాథుని దర్శించుకుని తమ జన్మలు చరితార్ధమయ్యాయని భావిస్తుంటారు. షిర్డీ సాయి భక్తులకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతున్న షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ పాటించేందుకు గ్రామస్థులు సన్నద్ధం కావడంతో మరోసారి షిర్డీ పేరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా మే 1వ తేదీనే కావడంతో 'మహా' రాజకీయాల్లోనూ వేడి పుట్టించే పరిస్థితి నెలకొంటోంది.
ఏమిటీ వివాదం?
షిర్డీ ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని భావిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు ఆ ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భద్రత కల్పించేందుకు నిశ్చయించారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తును షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను షిర్డీ సాయిబాబు సంస్థాన్ ట్రస్టు చూసుకుంటోంది. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. రోజువారీగా బాంబు స్క్వాడ్ తనిఖీలు జరుగుతుంటాయి. ఉచిత ఆహారం, వసతి సదుపాలను సంస్థాన్ ట్రస్ట్ చూసుకుంటుంది. ఛారిటబుల్ పాఠశాలలు, కాలేజీలను కూడా సంస్థాన్ నిర్వహిస్తోంది.
2018లో షిర్డీ విమానాశ్రయం ఏర్పాటైన తర్వాత విమానాశ్రయ భద్రత సీఐఎస్ఎఫ్ చూసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆయన భద్రతా వ్యవస్థకు బదులుగా సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2018లో సామాజిక కార్యకర్త సంజయ్ కాలే ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపి సాయి సంస్థాన్ అభిప్రాయం కోరింది. ఇందుకు సాయి సంస్థాన్ కూడా మద్దతు తెలిపింది. అయితే, ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ కోర్టుకు కూడా వెళ్లారు. పరిశ్రమలు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్ల భద్రతను చూసుకునే సీఐఎస్ఎఫ్‌కు ఆలయ భద్రతకు అవసరమైన శిక్షణ కానీ, సదుపాయాలు కానీ లేవని, ఆలయ పవిత్రత దెబ్బతింటుందని షిర్డీలోని అఖిలపక్ష నాయకులు, గ్రామస్థులు ఇటీవల సమవేశమై తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. మే 1 నుంచి నిరవధిక బంద్‌కు నిర్ణయించారు. తదుపరి కార్యాచరణను అదే రోజు జరిగే గ్రామసభలో నిర్ణయించనున్నారు.
ఆలయం తెరిచే ఉంటుంది...
షిర్డీని రోజువారీ సందర్శించే భక్తుల్లో మొదట్నించీ తెలుగువారి సంఖ్య గణనీయంగానే ఉంటోంది. అనేక మంది తెలుగువారు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని, వాణిజ్య, వసతి సదుపాయాల కల్పిస్తున్నారు. ఛారిటీ సంస్థలు కూడా నెలకొల్పి ఇతోథికంగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో షిర్డీ గ్రామస్థుల నిరవధిక బంద్ ప్రభావం ముఖ్యంగా షిర్డీని సందర్శించే తెలుగువారిపై ఏమేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకునేందుకు షిర్డీ గ్రామస్థులు, సాయిబాబా సంస్థాన్ ఏర్పాట్లు చేస్తున్నారు. షిర్డీలో వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడినప్పటికీ ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రామస్థులు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలు కల్పించనున్నారు. సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటిన్‌ను సంస్థాన్ యథాప్రకారం కొనసాగిస్తుంది. సాయిబాబా సంస్థాన్‌లో భక్తులు బస చేసే వీలుంది. సాయిబాబా సంస్థాన్ కల్పిస్తున్న సౌకర్యాలన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. తద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్చలు తీసుకుంటున్నారు.
గ్రామస్థుల డిమాండ్లేమిటి?
ఆలయానికి ప్రభుత్వ ప్రతిపాదిత సీఐఎస్ఎఫ్ భద్రతను గ్రామస్థులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సాయిబాబా సంస్థాన్‌కు ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్, ప్రాంతీయ అధికారులతో కమిటీ ఉండాలనేది వీరి మరో డిమాండ్. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు రద్దు చేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం సాయిబాబా సంస్థాన్ వ్యవహారాలను పరిశీలిస్తున్న తాత్కాలిక కమిటీ స్థానే పూర్తి స్థాయి కమిటీని నియమించాలని, ట్రస్టీల బోర్డులో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచే ఉంచాలని గ్రామస్థుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. తాత్కాలిక కమిటీల వల్ల సంస్థాన్ పనులు ముందుకు సాగడంలేదని, అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని వారంటున్నారు. ప్రభుత్వం సతర్వమే పూర్తి స్థాయి కమిటీ వేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.
ఉద్ధవ్ హయాంలోనూ బంద్...
షిర్డీ గ్రామస్థులు గత పర్యాయం 2020లో బంద్‌కు పిలుపునిచ్చారు. అప్పట్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీసుకున్న నిర్ణయానికి నిరసనగా గ్రామస్థులు ఈ బంద్ పిలుపునిచ్చారు. షిర్డీ సాయిబాబు జన్మస్థలం విషయంలో ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమైంది. షిర్డీ స్థాయి పర్బని జిల్లాలోని పత్రి గ్రామంలో జన్మించారంటూ పర్బని గ్రామంలో ఆలయ నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు థాకరే ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా షిర్డీ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షిర్డీ సాయి ఎప్పుడూ తాను పుట్టిన స్థలం కానీ, తల్లిదండ్రుల విషయం కానీ చెప్పలేదని, 16వ ఏటనే బాలుడిగా షిర్డీలో దర్శన మిచ్చి, కొద్దికాలం తర్వాత మళ్లీ షిర్డీకి తిరిగివచ్చి, సమాధి పర్యంతం 60 ఏళ్ల పాటు షిర్డీలోనే నివసించారని గ్రామస్థులు బలంగా తమ వాదను వినిపించారు. నిరవధిక సమ్మెకు దిగారు. అయితే, సమ్మె సమయంలోనూ షిర్డీ ఆలయాన్ని తెరిచే ఉంచారు. వాణిజ్య సంస్థలు మాత్రం మూసివేశారు.
తాజాగా, మరోసారి సీఐఎస్ఎఫ్ వివాదం తలెత్తడం, గ్రామస్థులు ఇందుకు నిరసనగా నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటుందా? మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఎలాంటి విఘ్నం రాకుండా చూసుకుంటుందా అనేది వేచిచూడాలి.