BJP fourth list: ఎట్టకేలకు సీఎం సీటు ఎక్కడో తేలింది..

ABN , First Publish Date - 2023-10-09T18:20:31+05:30 IST

ఎట్టకేలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిరీక్షణ ఫలించింది. బీజేపీ ఆభ్యర్థుల నాలుగవ జాబితాలో ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. సాంప్రదాయంగా శివరాజ్ పోటీ చేస్తూ వస్తున్న బుధనీ నియోజకవర్గాన్ని ఆయనకు పార్టీ అధిష్ఠానం కేటాయించింది.

BJP fourth list: ఎట్టకేలకు సీఎం సీటు ఎక్కడో తేలింది..

న్యూఢిల్లీ: ఎట్టకేలకు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh couhan) నిరీక్షణ ఫలించింది. బీజేపీ ఆభ్యర్థుల నాలుగవ జాబితాలో ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. సాంప్రదాయంగా శివరాజ్ పోటీ చేస్తూ వస్తున్న బుధనీ (Budhni) నియోజకవర్గాన్ని ఆయనకు పార్టీ అధిష్ఠానం కేటాయించింది. 57 మంది సభ్యులతో సోమవారంనాడు విడుదల చేసిన జాబితాలో శివరాజ్ సింగ్‌తో పాటు నరోత్తమ్ మిశ్రా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, గోపాల్ భార్గవ, రాజేంద్ర శుక్లా, ఓం ప్రకాష్ సఖ్లేచా వంటి ప్రముఖులకు చోటు దక్కింది. మధ్యప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించన రోజే ఈ జాబితాను విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. బీజేపీ ఇంతవరకూ విడుదల చేసిన జాబితాలో ముగ్గురు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగన్ సింగ్ కులస్తే, నలుగురు లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాంలో నవంబర్‌లో ఎన్నికలు జరుగనుండగా, అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన డిసెంబర్ 3న ఉంటుంది.

Updated Date - 2023-10-09T18:20:31+05:30 IST