బీజేపీకి షాక్.. మాజీమంత్రి రాజీనామా
ABN , First Publish Date - 2023-04-16T09:06:10+05:30 IST
భారతీయ జనతా పార్టీకి మాజీమంత్రి ఒకరు షాకిచ్చారు. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పలువురు నేతల రాజీనామాల పర్వం బీజేపీలో వరుసగా నాల్గో రోజు కూడా కొనసాగింది. ఒకప్పటి జనతాపరివార్‌కు చెందిన ప్రముఖ నేత బీ సోమశేఖర్(B Somasekhar) శనివారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళినికుమార్ కటీలు(Nalinikumar Katilu)కు పంపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను మళవళ్లి టికెట్‌ను ఆశించానని, పైగా ఇవే తనకు చివరి ఎన్నికలని, ఒక అవకాశం ఇవ్వాలని నేలందరికీ విన్నవించుకున్నా పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. గత దశాబ్ద కాలం ఎలాంటి పదవులు ఆశించకుండా బీజేపిలో పనిచేస్తున్నానని, పార్టీ తనను వాడుకుని వదిలేసిందని ఆయన ఆవేదన చెందారు. అభిమానులతో చర్చించిన అనంతరం తన భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. కాగా జేడీఎ్‌సలో చేరాల్సిందిగా సోమశేఖర్‌ను పార్టీ నేతలు ఆహ్వానించారు.