Maharasthra Politics: మరింత మందికి మంత్రి కొలువులు
ABN , First Publish Date - 2023-07-03T21:21:28+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన మరుసటి రోజే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంచలన ప్రకటన చేస్తారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు సోమవారంనాడు మీడియా సమావేశంలో ప్రకటించారు. అభివృద్ధి ఎజెండాకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించినట్టు చెప్పారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కీలక నేత అజిత్ పవార్ (Ajit Pawar) మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన మరుసటి రోజే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంచలన ప్రకటన చేస్తారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) చేపట్టనున్నట్టు సోమవారంనాడు మీడియా సమావేశంలో ప్రకటించారు. అభివృద్ధి ఎజెండాకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించినట్టు చెప్పారు.
మహారాష్ట్రలోని ఎన్‌సీపీలో ఆదివారం నుంచి హైడ్రామా నడుస్తోంది. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో ఎన్‌సీపీలో చీలక తలెత్తింది. శివసేన-బీజేపీ కూటమిలో అజిత్ పవార్ చేరడం, వెంటనే రాజ్‌భవన్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన, ఆయనకు మద్దతుగా ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే అజిత్ పవార్ మీడియా సమావేశంలో ఎన్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలంతా తనతోనే ఉన్నారని, ఎన్‌సీపీ పార్టీ, గుర్తు తమవేనని, ఒక పార్టీగానే తాము ప్రభుత్వంలో చేరామని ప్రకటించడంతో ఎన్‌సీపీలో ప్రకంపకనలు చెలరేగాయి. ఈ కుట్ర వెనుక కొన్ని గ్రూపులు ఉన్నాయంటూ ఎన్‌సీపీ చీఫ్, వ్యవస్థాపకుడు శరద్ పవార్ పరోక్షంగా బీజేపీ విరుచుకుపడ్డారు. ఎన్‌సీపీ ఎన్నో ఉత్థానపతనాలను చవిచూసిందని, పార్టీని తిరిగి పునర్నిర్మిస్తామని ప్రకటించారు.
ఇంకా సమయం ఉందన్న సీఎం..అంతలోనే..!
కాగా, అజిత్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరిన క్రమంలో సీట్ల షేరింగ్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు, ఇంకా సమయం ఉందని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. ఆసక్తికరంగా 24 గంటలు కూడా తిరక్కుండానే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు సోమవారంనాడు ఆయన ప్రకటించడం విశేషం.
ఏడాది క్రితం శివసేన పార్టీలో తిరుగుబాటుకు సారథ్యం వహించిన ఏక్‌నాథ్ షిండే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేయడంతో బీజేపీతో చేతులు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆయన సీఎంగా, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 41 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. తొలి మంత్రివర్గ విస్తరణలో 18 మందిని మంత్రులుగా తీసుకున్నారు. 43 మందికి క్యాబినెట్‌లో చేటు ఉన్నప్పటికీ పార్టీలో విభేదాలు రాకూడదనే ఆలోచనతో షిండే మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరడంతో 9 మంది ఆ పార్టీ నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో ఎంతోకాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్న షిండే వర్గం నేతలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీని నమ్ముకున్న తమను కాదని కొత్తగా చేరిన వారికి క్యాబినెట్‌లో చోటు కల్పించడాన్ని వారు జీర్ణించుకులేకపోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం విస్తరణలో ఇంకెంత మాత్రం జాప్యం చేయడం తగదని షిండే స్థిర నిశ్చయానికి వచ్చారని, అందుకు అనుగుణంగానే మంత్రివర్గ విస్తరణ ప్రకటన చేశారని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాను కలిసి మంత్రివర్గ విస్తరణ చేపడతారని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.