State Govt: వృద్ధాప్య పింఛన్ రూ. 1200కు పెంపు..

ABN , First Publish Date - 2023-07-23T09:32:41+05:30 IST

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం, ఒరగడం తదితర ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు, కలైం

State Govt: వృద్ధాప్య పింఛన్ రూ. 1200కు పెంపు..

- కొత్త పరిశ్రమలకు అనుమతి

- రూ.1000 పథకానికి 36 వేల శిబిరాలు

- మంత్రివర్గ నిర్ణయం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం, ఒరగడం తదితర ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు, కలైంజర్‌ మహిళా సాధికారిక నగదు పథకం అమలుకు శిబిరాల నిర్వహణ తదితర కీలక అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. సచివాలయంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పారిశ్రామిక శాఖ అంశాలపై ప్రధానంగా చర్చించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేయనున్న పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు విలేకరుల సమావేశంలో క్లుప్తంగా ప్రకటించారు. ఒరగడం ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న కొత్త పరిశ్రమలకు మంత్రి వర్గం అనుమతిని జారీ చేసిందని, గృహిణులకు ప్రతినెలా రూ.1000 వారి బ్యాంక్‌ ఖాతాల్లో చెల్లించే పథకానికి సంబంధించి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించి అర్హులైనవారిని ఎంపిక చేయడంపై సీఎం కొన్ని సూచనలు చేశారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో వృద్ధులకిచ్చే నెలసరి ఫించన్‌ను రూ.1000 నుంచి రూ.1200కు పెంచడానికి, ఇదే విధంగా దివ్యాంగులకు ఇచ్చే నెలసరి ఆర్థిక సహాయాన్ని రూ.1000 నుంచి రూ.1500కు పెంచడానికి మంత్రివర్గం ఆమోదించినట్లు ఆయన తెలిపారు. వృద్ధాప్య ఫించన్‌ పెంపువల్ల సుమారు 30లక్షల మంది లబ్ధి పొందనున్నారని తెలిపారు.

nani6.jpg

ఈ పించన్‌ పెంపువల్ల ప్రభుత్వంపై యేడాదికి రూ.845.91 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఇదే విధంగా ఇంటి పనిమనుషులుగా, సహాయకులుగా ఉంటున్న మహిళకు ఇచ్చే నెలసరి సహాయాన్ని కూడా రూ.1200కు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక గృహిణులకు రూ.1000 చెల్లించే పథకం దరఖాస్తుల పంపిణీ చెన్నైలో పూర్తికావస్తోందన్నారు. ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సుమారు 36 వేల శిబిరాలు నిర్వహించి దరఖాస్తులు పంపిణీ ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఆదేశించారన్నారు. తొలివిడతగా 21031 శిబిరాలు, రెండో విడతగా 14194 శిబిరాలు అంటూ మొత్తం 35925 శిబిరాలను ఆగస్టులోగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్‌, పొన్ముడి, ఎం.సుబ్రమణ్యం, రామచంద్రన్‌, ఉదయనిధి, ఐ.పెరియసామి, అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, తంగం తెన్నరసు, కే.ఎన్‌.నెహ్రూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు.

nani6.3.jpg

Updated Date - 2023-07-23T09:32:41+05:30 IST