Vande Bharat Trains : వందే భారత్ రైళ్లపై రాళ్లు విసిరితే కఠిన శిక్షలు : ఎస్‌సీఆర్
ABN , First Publish Date - 2023-03-29T17:20:28+05:30 IST
సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను దక్షిణ మధ్య రైల్వే (SCR) కోరింది. వందే భారత్ రైళ్లు
న్యూఢిల్లీ : సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను దక్షిణ మధ్య రైల్వే (SCR) కోరింది. వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains)పై రాళ్లు విసరడం వంటి దుశ్చర్యలకు పాల్పడేవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లపై రాళ్లు విసిరిన సంఘటనలు వెలుగులోకి రావడంతో ఓ పత్రికా ప్రకటనలో ఈ హెచ్చరికను జారీ చేసింది.
ఎస్‌సీఆర్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, కాజీపేట-ఖమ్మం, కాజీపేట-భువనగిరి, ఏలూరు-రాజమండ్రి సెక్షన్లలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉందని తెలిపింది. కొందరు దుండగులు వందే భారత్ రైళ్ళపై దాడులు చేస్తున్నారని, జనవరి నుంచి ఇటువంటి తొమ్మిది సంఘటనలు జరిగాయని తెలిపింది.
వందే భారత్ రైళ్ల సేవలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రైళ్లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎస్‌సీఆర్ విడుదల చేసిన ప్రకటనలో, రైల్వేస్ యాక్ట్‌లోని సెక్షన్ 153 ప్రకారం రైళ్లపై రాళ్లు విసరడం క్రిమినల్ నేరమని తెలిపింది. ఈ నేరానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించవచ్చునని, గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది.
రైళ్లపై రాళ్లు విసిరిన సంఘటనలపై నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 39 మందిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఎస్‌సీఆర్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలను నిరోధించేందుకు ఆర్పీఎఫ్ అనేక చర్యలు చేపట్టిందన్నారు. రైలు పట్టాలకు సమీపంలోని గ్రామాల సర్పంచ్‌లతో సమన్వయం కుదుర్చుకుని, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రైళ్లపై రాళ్లు విసిరే అవకాశం ఉన్న చోట్ల సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.
గతంలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కూడా దాడులు జరిగాయి. అదేవిధంగా వందే భారత్ రైళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. మార్చి 11న హౌరా-న్యూ జల్పాయిగురి వందే భారత్ రైలుపై రాళ్ళ దాడి జరగడంతో ఓ బోగీలోని కిటికీ దెబ్బతింది. దీనిపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఇచ్చిన ట్వీట్‌లో తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ఆదేశాలు లేకుండా వందే భారత్ రైళ్లపై దాడులు జరగవన్నారు. భారత దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయన్నారు. ‘‘దేశానికి మీరు మంచి చేయరు, ఇతరులను చేయనివ్వరు’’ అని దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి :
India Vs China : ఎస్‌సీఓ సదస్సులో చైనాకు భారత్ షాక్!
UPI Transactions : డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలా? అమ్మో!