Sukesh Leaks : ఉన్నట్లుండి మరో బాంబ్ పేల్చిన సుఖేష్.. బీఆర్ఎస్ నేత స్క్రీన్ షాట్లు బయటిపెట్టి..
ABN , First Publish Date - 2023-04-06T20:17:16+05:30 IST
మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి జైలు నుంచి మరో లేఖ విడుదల చేశాడు.
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను(Arvind Kejriwal) ఉద్దేశించి జైలు నుంచి మరో లేఖ విడుదల చేశాడు. లేఖలో కేజ్రీవాల్‌తో పాటు టీఆర్ఎస్(TRS) నేతల ప్రస్తావన చేశాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు రూ. 15 కోట్లు టీఆర్ఎస్ కార్యాలయంలో ఇచ్చానని చెప్పాడు. డబ్బు ముట్టినట్టు టీఆర్ఎస్ నేత చేసిన చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయని వెల్లడించారు. సౌత్ గ్రూపులో ఉన్న టీఆర్ఎస్ నేతతో కేజ్రీవాల్‌కు ఉన్న సంబంధాలు స్పష్టంగా బయటపడుతున్నాయని, ఆ టీఆర్ఎస్ నేత ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించాడు. తన సహాయకుడు ఏపీ (అరుణ్ పిళ్ళై)కి రూ. 15 కోట్లు ఇవ్వాల్సిందిగా ఆ టీఆర్ఎస్ నేత చాట్‌లో స్పష్టంగా చెప్పారని సుఖేశ్ లేఖలో తెలిపాడు. రూ. 15 కోట్లను 15 కేజీల నెయ్యిగా చాట్‌లో పేర్కొన్నారని, పిళ్ళై క్యాష్ బాక్సులను నలుపు రంగు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ (రిజిస్ట్రేషన్ నెంబర్ 6060)లో పెట్టారని స్పష్టం చేశాడు. కారు విండ్‌షీల్డ్‌పై ఎమ్మెల్సీ అనే స్టిక్కర్ ఉందని, అది టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే పార్క్ చేసి ఉందని వెల్లడించాడు. చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ - టీఆర్ఎస్ మధ్య ఉన్న ఆర్థిక, వ్యాపార బంధాలు స్పష్టమవుతున్నాయని వెల్లడించాడు. ఇప్పుడు విడుదల చేస్తున్న చాట్ స్క్రీన్ షాట్లు కేవలం స్టార్టర్లు మాత్రమేనని, మెయిన్ కోర్సు ఇంకా ఉందన్నాడు. తాను మాట్లాడే ప్రతి మాటకు తన దగ్గర సాక్ష్యం ఉందని, అవసరమైతే నార్కో, పాలీగ్రాఫ్ టెస్టులకు కూడా తాను సిద్ధమని ప్రకటించాడు. సోమవారం ఈడీ, సిబిఐలకు వాట్సప్, టెలీగ్రాప్ చాట్‌లను అందజేస్తానని సుకేశ్ చంద్రశేఖర్ తెలిపాడు. మొత్తం 703 చాట్‌లు ఉన్నాయని చెప్పాడు.
ఇటీవలే తొలి లేఖ విడుదల చేసిన సుకేశ్.. రానున్న రోజుల్లో కేజ్రీతో, సత్యేంద్రజైన్‌తో తాను జరిపిన చాటింగ్ మొత్తాన్నీ బయటపెడతానని, ఆ ట్రైలర్ చూసి సిగ్గుతో కేజ్రీవాల్ ముఖం చెల్లకుండా పోతుందని హెచ్చరించాడు. ‘‘ఇప్పుడు నీ కౌంట్‌డౌన్ మొదలైంది, సోదరా.. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఆపు. నీకు చెప్పడం ఇదే చివరిసారి. నీ అధికార సింహాసనం కదిలిపోయేలా చేస్తానని హామీ ఇస్తున్నా. నీ గోల్‌మాల్ వ్యవహారాలను, అవినీతిని అన్నింటినీ బయటపెడతా. చివరగా ఒక సలహా కేజ్రీవాల్‌జీ.. సిగ్గులేని మీ నకిలీ ముఖాన్ని ప్రదర్శించకండి. అది మీ కళ్లలోనే కనపడుతుంది. మీరు త్వరలో తిహార్(జైలు) క్లబ్‌లో చేరతారని మీకు తెలుసు. మీ ఆటలన్నీ ముగిశాయి. కర్ణాటక అసెంబ్లీలో ఆప్, మీరు ఒక జోక్‌గా మిగిలిపోతారు. మీకు రామనవమి శుభాకాంక్షలు, జై శ్రీరామ్’’ అంటూ సుకేశ్ చంద్రశేఖర్ తన లేఖను ముగించారు. లేఖలో ఆయన తన పేరు స్పెల్లింగ్‌ను సుకశ్ చంద్రశేఖర్‌గా రాసుకోవడం గమనార్హం. అలాగే.. అతడు తన లేఖలో ప్రస్తావించిన ‘ఏపీ’ అనే వ్యక్తి ఎవరంటే.. మద్యం కుంభకోణంలో ఆ పేరుగల వ్యక్తి అరుణ్ పిళ్లై ఒక్కరే. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాను బినామీనని తొలుత ఈడీ అధికారుల ముందు ఒప్పుకొన్న పిళ్లై.. ఆ తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సుకేశ్ చంద్రశేఖర్.. బెంగళూరులోని భవానీనగర్‌కు చెందిన ఓ రబ్బరు కాంట్రాక్టరు కుమారుడు. కేవలం పదిహేడేళ్ల వయసులో నేరజీవితాన్ని మొదలుపెట్టి.. ప్రముఖ పారిశ్రామికవేత్తలను, సినీతారలను మోసం చేసి, బెదిరించి, మభ్యపెట్టి కోట్లాది రూ పాయలు సాధించిన మోసగాడు! ప్రముఖుల కుమారుడిననో.. సెక్రటరీననో.. పరిచయం చేసుకుని, ప్రభుత్వ కాంట్రాక్టులు, బెయిళ్లు ఇప్పిస్తానంటూ దోచుకోవడం ఇతడి తీరు. ఇదే క్రమంలో.. జయలలిత చనిపోయాక, అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులను ఇప్పిస్తానంటూ టీటీవీ దినకరన్‌తో రూ.50 కోట్లకు డీల్ కుదుర్చుకుని అడ్డంగా పోలీసులకు దొరికిపోయి తిహార్ జైలుకు చేరాడు! అక్కడ కూడా ఖాళీగా కూ ర్చోలేదతడు! 2020, 2021సంవత్సరాల్లో.. జైల్లో నుంచే ఫోన్లు, గొంతు మార్చే పరికరాల సాయంతో.. ర్యాన్‌బాక్సీ యజమాని శివీందర్ సింగ్ భార్యకు ఫోన్ చేసి ఆయనకు బెయిల్ ఇప్పిస్తానంటూ రూ.200 కోట్లు దోచుకున్న ఘనుడు! ఇలా సంపాదించిన సొమ్ముతో.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి వంటి సినీతారలకు వల వేసి, వారికి ఖరీదైన కానుకలిచ్చి బుట్టలో వేసుకున్న ఘరానా కేటుగాడు.
సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం అతడు ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. ఇటీవల అతడి సెల్‌లో అధికారులు తనిఖీలు చేసి.. రూ.15 లక్షల విలువ చేసే చెప్పులు, రూ.80 వేల విలువ చేసే ప్యాంట్లు స్వాధీనపరుచుకున్నారు. జైల్లోంచే బెదిరింపు రాకెట్ నడపడానికి వీలు కల్పించినందుకు.. తిహార్ జైలు అధికారులకు నెలకు కోటి రూపాయల దాకా లంచంగా ఇచ్చేవాడని సమాచారం. ఈడీ ఉచ్చుకు చిక్కి 2017 నుంచి తిహార్ జైల్లో ఉన్న సుకేశ్‌ను కలవడానికి కనీసం 12 మంది దాకా మోడళ్లు, నటీమణులు వచ్చారని సమాచారం. జైలు అధికారులకు భారీగా లంచాలు ఇవ్వడం వల్ల.. సుకేశ్‌ను కలవడానికి అతడి భార్య లీనా మారియా పాల్ (తమిళ సినీ నటి) ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి అడ్డంకులూ లేకుండా వెళ్లేందుకు వారు అనుమతిచ్చేవారట. జైల్లో సుకేశ్ ‘ఆఫీసు’.. టీవీ, ఫ్రిజ్, సోఫా వంటివాటితో అత్యంత విలాసవంతంగా ఉండేదని మారియాపాల్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. జైల్లో అతడిచ్చే ‘చికెన్ పార్టీ’లకు ‘ఆడ’ అతిథులను పెద్ద ఎత్తు న ఆహ్వానించేవారని.. వాటికి పలువురు మోడళ్లు, నటీమణులు వచ్చేవారని.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి (‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో నర్తించింది) కూడా ఇలా అతడు ఇచ్చిన పార్టీలకు వచ్చారని అధికారులు చెబుతున్నారు.