Article 370 : అధికరణ 370 రద్దుపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2023-08-02T13:58:20+05:30 IST

పూర్వపు జమ్మూ-కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించిన భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు బుధవారం నుంచి ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుపుతుంది.

Article 370 : అధికరణ 370 రద్దుపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ : పూర్వపు జమ్మూ-కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించిన భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు బుధవారం నుంచి ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుపుతుంది.

అధికరణ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల తరపున వాదనలను ప్రారంభించిన లీడ్ కౌన్సెల్ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తన వాదనలు గురువారం వరకు కొనసాగుతాయని చెప్పారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, పిటిషనర్ల తరపున లీడ్ కౌన్సెల్ అన్ని అంశాలపైనా వాదనలు వినిపించేందుకు కోర్టు అనుమతిస్తుందని, మిగిలిన న్యాయవాదులు కొన్ని అంశాలను జత చేయవచ్చునని తెలిపారు ఒకే విషయాన్ని పలువురు న్యాయవాదులు పదే పదే చెప్పడాన్ని నిరోధించడం కోసం ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన పని దినాల్లో రోజువారీ విచారణ జరుపుతామని ధర్మాసనం గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. సోమ, శుక్రవారాల్లో మిసిలేనియస్ మ్యాటర్స్ విచారణ జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో కేవలం కొత్త పిటిషన్లను మాత్రమే కోర్టు స్వీకరిస్తుంది. రెగ్యులర్ మ్యాటర్స్‌పై విచారణ జరగదు.

కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సందర్భంగా అధికరణ 370ని రద్దు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి 2019లోనే అప్పగించింది.

2019 ఆగస్టు 5 తర్వాత జమ్మూ-కశ్మీరులో పరిస్థితి మెరుగుపడిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే రాజ్యాంగపరమైన అంశాన్ని నిర్ణయించి, తీర్పు చెప్పడంలో కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌ ప్రభావం ఏమీ ఉండదని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది.


ఇవి కూడా చదవండి :

Haryana and Delhi : హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీలో గస్తీ ముమ్మరం..

YCP Vs Congress : ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిదంబరం ఆగ్రహం

Updated Date - 2023-08-02T13:58:20+05:30 IST