Supreme court: కొత్తగా మరో ఇద్దరు జడ్జీల ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2023-07-14T15:55:17+05:30 IST

సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. కొత్తగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి చేత భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శుక్రవారంనాడు ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేయించారు.

Supreme court: కొత్తగా మరో ఇద్దరు జడ్జీల ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు (Supreme court) కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. కొత్తగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్(Ujjal Bhuyan), జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి(S.Venkatanarayana Bhatti) చేత భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శుక్రవారంనాడు ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు సంఖ్యాబలం 34 కాగా, కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 32కు చేరింది.


తెలంగాణ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి భట్టిల పదోన్నతికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారంనాడు వీరి నియామకాలపై ఒక ప్రకటన చేశారు.


జస్టిస్ ఉజ్జల్ భుయాన్

జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 1964 ఆగస్టు 2న జన్మించారు. 2011 అక్టోబర్ 17 నుంచి గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. సీనియర్ మోస్ట్ జడ్జిగా భుయాన్ 2022 జూన్ 29న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయశాఖలో ముఖ్యంగా టాక్సేషన్‌లో ఆయనకు విశేష అనుభవం ఉంది. ముంబై హైకోర్టు జడ్జిగా కూడా ఆయన గతంలో సేవలందించారు. అనేక కీలక కేసుల్లో ఆయన ఇచ్చిన తీర్పులు ప్రశంసలు అందుకున్నాయి.


ఎస్‌ వెంకటనారాయణ భట్టి..

జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి 1962 మే 6న జన్మించారు. 2013 ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఆయన తన జ్యూడిషియల్ కెరీర్ ప్రారంభించారు. సీనియర్ మోస్ట్‌ జడ్జిగా నిలిచారు. 2022 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లేనందున ఆయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం ఆయన 2019 మార్చిలో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 జూన్ 1 ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

Updated Date - 2023-07-14T15:55:17+05:30 IST