Supriya Sule: ఎవరు చెప్పారు ఆయన హ్యాపీగా లేరని..?
ABN , First Publish Date - 2023-06-11T19:18:50+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన నియామకం పట్ల పార్టీ నేత అజిత్ పవార్ సంతృప్తిగా ఉన్నారంటూ వస్తున్న వార్తలను సుప్రియా సూలే తోసిపుచ్చారు. అవిన్నీ పుకార్లేనని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన నియామకం పట్ల పార్టీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) సంతృప్తిగా ఉన్నారంటూ వస్తున్న వార్తలను సుప్రియా సూలే (Supriya Sule) తోసిపుచ్చారు. అవిన్నీ పుకార్లేనని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఎన్‌సీపీ 25వ వార్షికోత్సవం సందర్భంగా, పార్టీ కీలక బాధ్యతలను ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారంనాడు ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కుమార్తె సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌ను ప్రకటించారు. పార్టీ కీలక నేత, తన మేనల్లుడు అజిత్ పవార్‌కు ఎలాంటి బాధ్యత అప్పగించలేదు. దీంతో ఈ నియామకాల పట్ల అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నారంటూ పుకార్లు షికారు చేసాయి. వీటిపై తాజాగా సుప్రియా సూలే స్పందించారు. ''ఆయన (అజిత్ పవార్) సంతోషంగా లేరని ఎవరు చెప్పారు? ఆయనను ఎవరైనా అడిగారా? ఆ రిపోర్టులన్నీ గాసిప్‌లే'' అని ఆమె అన్నారు. ఆశ్రితపక్షపాతం ఆరోపణలపై స్పందిస్తూ, ఏ పార్టీకి ఆశ్రితపక్షపాతం లేదని ప్రశ్నించారు. ఆశ్రితపక్షపాతం గురించి మాట్లాడేటప్పుడు పనితీరును ఎందుకు ప్రస్తావించరు? అని నిలదీశారు. ఎవరైనా సరే పార్లమెంటు సభ్యురాలిగా తన పనితీరు పరిగణలోకి తీసుకుని మాట్లాడాలని, ఆశ్రితపక్షపాతం అనే మాట సరికాదని అన్నారు. తనపైన, ప్రఫుల్ పటేల్‌పైన నమ్మకం ఉంచిన శరద్ పవార్‌కు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు తాను రుణపడి ఉంటానని, పార్టీని పటిష్టం చేయడమే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పారు.
దీనికిముందు, ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులైన సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌కు అజిత్ పవార్ ఓ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. వారి నియామకాల విషయంలో తాను హ్యాపీగా ఉన్నానని చెప్పారు.