Tejashwi Yadav: సొంత నియోజకవర్గంలో నిరసనల సెగ
ABN , First Publish Date - 2023-01-25T16:03:27+05:30 IST
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సొంత నియోజకవర్గమైన రఘోపూర్ లో చేదు అనుభవం ఎదురైంది. దయనీయ స్థితిలో ఉన్న మౌలిక వసతులపై స్థానికులు..
పాట్నా: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)కు సొంత నియోజకవర్గమైన రఘోపూర్ (Raghopur)లో చేదు అనుభవం ఎదురైంది. దయనీయ స్థితిలో ఉన్న మౌలిక వసతులపై స్థానికులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు ఆయన కాన్వాయ్ వెళ్తున్న రోడ్డును దిగ్బంధించారు. రఘోపూర్‌లో రూ.60 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు తేజస్వి యాదవ్ వచ్చినప్పుడు ఈ నిరసనలు పెల్లుబికాయి. మాలిక్ పూర్ గ్రామంలోని మహాదళిత్ వర్గానికి చెందిన కొందరు తేజస్వి కాన్వాయ్ మార్గాన్ని అడ్డుకున్నారు. కొత్త రోడ్లు నిర్మిస్తామనే ప్రకటన చేయాలంటూ మంత్రిని వారు నిలదీశారు. కాలేజీ, స్టేడియంకు సంబంధించిన అంశాలపై పలువురు విద్యార్థులు తేజస్విని నిలదీశారు.
మహాదళిత్ టోల ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఒక కులానికి చెందిన వారిని అనుమతించడం లేదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి తమ వినతులు సమర్పించినప్పటికీ జరిగిందేమీ లేదని వారన్నారు. మాలిక్‌పూర్‌లోని మహాదళిత్ టౌన్‌షిప్‌పై సరైన రోడ్లు నిర్మించాలని మరో నిరసనకారుడు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు స్థానికుల నిరసనల మధ్య తేజస్వి యాదవ్ ఒకింత ఆలస్యంగా అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ వేదికకు చేరుకున్నారు.