Sharad Pawar: పార్టీ గుర్తు మాతోనే ఉంది, ఎక్కడికీ పోలేదు..
ABN , First Publish Date - 2023-07-05T17:14:18+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తమతోనే ఉందని, ఎక్కడికీ పోలేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తమను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని తెలిపారు. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో పవార్ మాట్లాడారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు (NCP Symbol) తమతోనే ఉందని, ఎక్కడికీ పోలేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. తమను అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని తెలిపారు. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీని చీల్చేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలను తాము పరిగణనలోకి తీసుకోమని చెప్పారు. అజిత్ పవార్ వర్గం ఎలాంటి విధివిధానాలను పాటించలేదని పవార్ స్పష్టం చేశారు.
సమస్య ఉంటే నాతో చెప్పి ఉండాల్సింది..
''అజిత్ పవార్‌కు ఏదైనా సమస్య ఉంటే నన్ను సంప్రదించాల్సింది. ఆయన మనస్సులో ఏదైనా ఉంటే ఆ ఆలోచన నాతో పంచుకుని ఉండొచ్చు'' అని పవార్ అన్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో పవార్ మండిపడ్డారు. ఎన్‌సీపీ అవినీతి పార్టీ అని మాట్లాడిన బీజేపీ ఇప్పుడు ఎన్‌సీపీని ఎందుకు ప్రభుత్వంలో చేర్చుకుంది? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఉద్ధవ్ థాకరే విషయంలో జరిగినదే ఇప్పుడు కూడా పునరావృతమైందని బీజేపీని తప్పుపట్టారు. తమకు ఎలాంటి అధికార దాహం లేదని, ప్రజల కోసం తాము పనిచేస్తూనే ఉంటామని అన్నారు. ఇవాళ యావత్ దేశం మహారాష్ట్ర పరిణామాల వైపే చూస్తోందని, ఇవాళ తాము ఏర్పాటు చేసిన ఎన్‌సీపీ సమావేశం చారిత్రాత్మకమని చెప్పారు. తమ మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా నదురూబెదురూ లేకుండా ముందుకు వెళ్తామని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలను చూశానని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్తామని చెప్పారు. సిక్‌లోని పార్టీ కార్యాలయాన్ని వాళ్లు (అజిత్ వర్గం) స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారని పవార్ విమర్శించారు.