Asaduddin Owasi: థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం.. నాయకుడు ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-09-17T15:27:55+05:30 IST

దేశంలో తృతీయ ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యం వహించాలని ఆయన కోరారు.

Asaduddin Owasi: థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం.. నాయకుడు ఎవరంటే..?

హైదరాబాద్: దేశంలో తృతీయ ఫ్రంట్ (Third Front) ఏర్పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) అన్నారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యం వహించాలని ఆయన కోరారు. ఆదివారంనాడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, థర్డ్ ఫ్రంట్ కచ్చితంగా ఏర్పడుతుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. మాయావతి, కేసీఆర్ వంటి నేతలు ఎన్డీయే, ఇండి అలయెన్స్‌లో లేరని, ఆ పార్టీలకు గణనీయమైన ఉనికి ఉందని అన్నారు. కేసీఆర్ సారథ్యం చేపట్టి, థర్డ్ ఫ్రంట్ వైవిద్యం చాటుకుంటారని తాను అనుకుంటున్నానని చెప్పారు.


హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంపై మాట్లాడుతూ, దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) రిజర్వేషన్లు పెంచాలని సీడబ్ల్యూసీ సిఫారసు చేసిందని, ముస్లింల సంగతేమిటని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ముస్లింల రిజర్వేషన్ గురించి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తాను పదే పదే పార్లమెంటులో ఈ విషయంపై నిలదీస్తూనే ఉన్నానని చెప్పారు. మైనరిటీలకు రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ 'హిపోక్రసీ' ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో మీరు ఏం చేశారో చూపించాలని ఆ పార్టీని ప్రశ్నించారు.


''హర్యానాలో జనైద్, నసీర్‌‌లను సజీవదహనం చేశారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. కన్హయ్య లాల్‌ను ఉగ్రవాదులు (రాజస్థాన్) చంపేస్తే ఆయన కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా విషయంలో కాంగ్రెస్ వివక్ష చూపుతోంది'' అని ఒవైసీ విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తాయిలాలు ఎరచూపిస్తోందన్నారు.


కర్ణాటకలో...

కర్ణాటకలో బీజేపీ హయాలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఆర్థికవ్యవస్థ గందరగోళంలో పడిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎలాంటి భయాలు లేకుండా ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కాలేజీలకు వెళ్తున్నారు. ముస్లింలను తెలంగాణలో కొట్టిచంపడం లేదని, ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడుస్తోందని ప్రశంసించారు.


ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌పై..

అనంతనాగ్‌లో ఓ వైపు ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా, వరల్డ్ కప్ క్రికెట్‌కు ఇండియా-పాకిస్థాన్ సిద్ధమవుతుండటంపై అడిగినప్పుడు, అధికారంలో ఉన్నందున బీజేపీ పెదవి విప్పడం లేదంటూ తప్పుపట్టారు. "మన సైనికులను, కల్నల్‌ను, మేజర్‌ను అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో కోల్పాయాం. బీజేపీ విపక్షంలో ఉండి, అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ వంటివి జరిగి ఉంటే, ప్రభుత్వం బిర్యానీ డిప్లమసీ ప్రదర్శిస్తోందంటూ బీజేపీ నిందించేది. ఇప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారని నేను వాళ్లను అడుగుతున్నాను. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో (అహ్మదాబాద్)లో ఇండియా-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌కు ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాలన్నారు.

Updated Date - 2023-09-17T15:27:55+05:30 IST